వ్రాసినది: mohanrazz | 2009/07/29

నాడొడిగల్ -తెలుగులో ఆడుతుందా?

nadodigal-movie[1]

దక్షిణ భారత సినిమాల్లో ఒక విశిష్టత ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం- నాల్గింటిలో ఏ భాష లో నైనా మంచి కథాబలమున్న చిత్రాలు వస్తే వెంటనే అవి తక్కిన మూడింటిలోకీ వచ్చేస్తాయి. మళయాళం లో వచ్చిన తెన్‌కాసి పట్నం (తెలుగులో హనుమాన్ జంక్షన్), వాసంతియుం లక్ష్మియున్ పిన్నె న్యానుం (శ్రీన్ వాసంతి లక్ష్మి) కానీ, తమిళ్ లో వచ్చిన ఆటోగ్రాఫ్ కానీ కన్నడ లో వచ్చిన జోగి కానీ తెలుగు లో వచ్చిన ఒక్కడు కానీ తక్కిన మూడు భాషల్లోకో లేదా ఆ మూడింటిలో రెండింటిలో వెళ్ళాయి. అలా ఇతరభాషల్లోకి వెళ్ళినతర్వాత ఆ సినిమాలు అక్కడకూడా హిట్టయ్యాయా లేదా అనేది మళ్ళీ చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది, అది వేరే విషయం. కానీ మిగతా అన్ని భాషల్లోకీ వెళ్ళగల సత్తా ఉండే కథలు ఏ భాషలోనైనా కొంచెం అరుదు గానే వస్తూంటాయి. ఈ మధ్యే రిలీజ్ అయిన నాడొడిగల్ సినిమా గురించి చాలా విని, అప్పుడే తెలుగులోకి (తెలుగులో రవితేజ అంటున్నారు మరి), కన్నడలోకీ, హిందీ లోకి దీన్ని రీమేక్ చేయడానికి సన్నహాలు జరిగిపోయాయని తెలిసి, కొంత కుతూహలం తోనే ఈ సినిమా చూసాను. మరి ఈ సినిమా కథ లో నిజంగా అంత సత్తా ఉందా? ఇతర భాషల్లో కూడా ఇలాగే విజయఢంకా మోగించే సత్తా ఈ కథకి ఉందా? వివరాల్లోకి వెళ్తే..

(spoilers ahead)
 

కథాకమామీషు:
ఓ మోస్తరు పల్లెటూళ్ళో జరిగే ఈ కథలోని మూడు ప్రధాన పాత్రలు కరుణ, చంద్ర, పాండి. కరుణ బి.ఎ. హిస్టరీ లో గోల్డ్ మెడలిస్ట్. స్టాఫ్ సెలెక్షన్ తదితర గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. “నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటేనే నీకు నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను” అని తన మామగారు పెట్టిన కండిషన్ వల్లనూ, ఆ పిల్లమీద ఇతనికీ ఉన్న ఇష్టం వల్లనూ, అంతకుమించి వల్లమాలిన ప్రేమ ఆ పిల్లకి ఇతని మీద ఉండడం వల్లనూ గవర్నమెంటుద్యోగం కోసం కొంచెం గట్టిగానే ప్రయత్నిస్తూంటాడు. ఇక రెండో వాడు చంద్ర. ఊళ్ళోనే ఒక కంప్యూటర్ ఇన్స్‌టిట్యూట్ లో పని చేస్తూ ఏనాటికైనా సొంత కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని కలగంటూ ఉంటాడు. ఓ ప్రక్క అందుకోసమని బ్యాంకులోన్ గురించి ప్రయత్నిస్తూ, ఇంకో ప్రక్క కరుణ కి తెలీకుండా కరుణ చెల్లెల్ని ప్రేమిస్తూంటాడు. మూడోవాడు పాండి. పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసి, అది వస్తే ఎటైనా వెళదామని అనుకుంటూ ఉంటాడు. బావిలో ఈతకొట్టడం,ఊళ్ళో తిరునాళ్ళప్పుడు చిన్నచిన్న గొడవలు జరిగితే వాళ్ళని వీళ్ళని కొట్టడం, ముగ్గురూ కలిసి అప్పుడప్పుడూ మందుకొట్టడం- ఇదీ వీళ్ళ దినచర్య. దర్శకుడు బా..గా… తాపీగా ఓ నలభై నిమిషాలు సమయం తీసుకుని ఈ క్యారెక్టర్లన్నీ నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసాక, సినిమా ఇంత నత్త నడక నడుస్తోందేమిటీ అని మనం ఒళ్ళు విరిచేసుకున్నాక, ఇంకా కథ మొదలు కూడా అయినట్లు లేదు అని మనసులో (కాదు, బయటికే) అనేసుకున్నాకన్నమాట-

శరవణ అని కరుణ చిన్నప్పటి ఫ్రెండొకడు దిగుతాడు. దిగినప్పటినుండి ఏదో పోగొట్టుకున్నవాడిలా, ఏదో సమస్య నెత్తి మీద పెట్టుకున్నవాడిలా ఉండే ఈ శరవణ ఉన్నట్టుండి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఎలాగో రక్షించి, చావాల్సినంత ప్రాబ్లెం నీకేమొచ్చిందని అడిగితే- షరా మామూలుగా లవ్ ప్రాబ్లెం అని, తాను కాలేజ్ లో ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్నవాళ్ళు తీసుకెళ్ళి హౌస్ అరెస్ట్ చేసారని, ఆ అమ్మాయి లేకుండా తాను బ్రతకలేనని చెబుతాడు. హీరో అయిన కరుణ కూడా అంతే షరా మామూలుగా – ఆ అమ్మాయిని వాళ్ళింట్లోనుంచి ఎత్తుకొచ్చేసి అయినా ఈ పెళ్ళి జరిపించే బాధ్యత తనదని ధైర్యం చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు ఫ్రెండ్స్ తో సహా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పళని రాజన్ , బాగా డబ్బు, పలుకుబడి, వ్యాపారాలు ఉన్న వ్యక్తి. శరవణ కూడా తక్కువోడేమీ కాదు. మాజీ ఎం.పి. కొడుకు. కానీ ఇటు శరవణ వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడం తో సాయం కోరి తన పాత స్నేహితులవద్దకి వచ్చాడు. సరే, కరుణ-పాండి-చంద్ర-ఇంకో ఫ్రెండ్ కలిసి ఎంతో సాహసం చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి విజయవంతంగా శరవణతో పెళ్ళి జరిపించేస్తారు. అబ్బే, క్లైమాక్స్ కాదు- ఇంటర్వలే.

అయితే ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చే క్రమం లో వాళ్ళ మనుషుల చేతిలో కాలుపోగొట్టుకుంటాడు చంద్ర. శాశ్వతంగా చెవిటివాడైపోతాడు పాండి. బాగా దెబ్బలుతగులుతాయి కరుణకి. అయినా వీళ్ళకేమీ బాధలేదు. ఒక ప్రేమ జంటని కలిపాము, ఒక ఫ్రెండ్ జీవితాన్ని నిలబెట్టామన్న తృప్తి.  నెమ్మదిగా కృత్రిమ కాలితో నడవడం నేర్చుకుంటాడు చంద్ర. మిషన్ సాయం తో వినగలుగుతాడు పాండి. కానీ ఎంతకీ గవర్నమెంటుద్యోగం తెచ్చుకోని కరుణని కాదని కూతురికి వేరే గవర్నమెంట్ ఉద్యోగికిచ్చి పెళ్ళి చేసేస్తాడు కరుణ వాళ్ళ మామ. అయితే వీళ్ళని షాక్ కి లోను చేసే నిజం ఈ లోగా తెలుస్తుంది. నిజానికి ఈ కథలోని “హార్ట్” ఇదే – పట్టుమని పదిరోజులు కూడా కలిసి ఉండలేక శరవణ, ప్రభ విడిపోయారు అని. వాళ్ళకేం, ఇద్దరూ బాగా డబ్బున్న వాళ్ళు. ఆ అమ్మాయి తనపాటికి తాను ఇంటికి వెళ్ళిపోతే, వాళ్ళ నాన్నగారు మళ్ళీ చేరదీసి ఆ అమ్మాయికి ఫ్రెష్ గా ‘మంచి’ సంబందాలు చూడటం మొదలెడతాడు. శరవణ వాళ్ళ అమ్మేమీ తక్కువ తినలేదు. కొండమీద గుళ్ళో జరిగిన పెళ్ళికి చట్టబద్దత లేదనీ, ఏదో మోజులో కొన్నాళ్ళు కలిసి ఉంటే ఉన్నారనీ చెప్పి ఒక సెంట్రల్ మినిస్టర్ కూతురితో శరవణ పెళ్ళి నిశ్చయిస్తుంది. కరుణకి ఒక్కసారిగా ఆ పెళ్ళి చేసిన తర్వాత వీళ్ళు ఎదుర్కొన్న కష్టాలు గుర్తొస్తాయి . పోలీసులు వీళ్ళని ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పమని ఎంత వేధించినా అన్నింటికీ తట్టుకుంటారే తప్పించి పెదవి విప్పరు.వాళ్ళ మనుషులు వీళ్ళ ఇళ్ళ మీద పడి భీబత్సం సృష్టించినా, ఆ తోపులాట లో కరుణ వాళ్ళ బామ్మ చనిపోయినా అన్నింటికీ తట్టుకుని నిలబెడతారు. కరుణ పోలీసు కేసుల్లో ఇరుక్కున్నాడు కాబట్టి ఇంక గవర్నమెంట్ ఉద్యోగం రాదని నిర్ణయించుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కూతుర్ని వేరే అతనితో పెళ్ళికి ఒప్పిస్తాడు కరుణ మామగారు. కేవలం ఆ శరవణ పెళ్ళి జరిపించడం అనే ఒక్క ఎపిసోడ్ వల్ల వీళ్ళ ముగ్గురి జీవితాలు శాశ్వత ప్రాతిపదికన మారిపోయాయి. ఆ పెద్దింటి పిల్లలేమో ఇదొక పీడకల గా మరిచిపోయి వేరే పెళ్ళిళ్ళకి సిద్దమై పోతుంటే, జీవితాల్ని ఫణంగా పెట్టి వాళ్ళ పెళ్ళిచేసి మనం వెర్రివెంగళప్పలుగా మిగిలిపోయామా అన్న ఫీలింగ్ ముగ్గురినీ దహిస్తూంటే వీళ్ళేం చేయాలి? వీళ్ళు ఏం చేసారు? ఏ సంచలన నిర్ణయం తీసుకున్నారు? తెరమీద చూడాల్సిందే!

ఇతరత్రా:

ఇతరత్రా అంటే- “నటీనటులంతా తమ తమ పరిధుల్లో బాగానే నటించారు”, “ఫోటోగ్రఫీ బాగానే ఉంది”, “ఎడిటింగ్ ఫరవాలేదు”, “నేపథ్య సంగీతం సినిమాలో భాగమైపోయింది”..ఇవి కాదు. నిజానికి సాధారణ ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూ లో – ఎప్పుడైనా మరీ పాత్‌బ్రేకింగ్ స్థాయిలో ఉంటే తప్పించి , ఇవన్నీ పెద్దగా చర్చించి తీరవలసిన అవసరం లేదని సాధారణ ప్రేక్షకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఒక తెలుగు ప్రేక్షకుడి గా ఈ సినిమా చూసాక కామన్ గా అనిపించే ప్రశ్నలు రెండు. ఒకటి-రవితేజ తో తీస్తే ఈ సినిమా తెలుగులో ఆడుతుందా. రెండు- పోనీ రవితేజ కాదనుకుందాం, ఇంకెవరితో తీసినా ఈ సినిమా తెలుగులో ఆడుతుందా? ఒక చిన్న ఉదాహరణ. ఓ ఆదివారం మధ్యాహ్నం ఎక్కడో అద్భుతమైన బిరియానీ దొరుకుతుందంటే వెతుక్కుంటూ మరీ ఆ మెస్ కి వెళ్ళాను. తీరా అక్కడికెళ్ళాక-“సార్, ఈ రోజు బిరియాని లేదు” అని చెప్పి పులిహోర వడ్డించాడు. నీరసపడిపోయేను. అలాంటి నీరసం లోనుంచి బయటపడి తృప్తిగా బయటికి రావాలి అంటే- ఆ పులిహోర నా జీవితం లో తిన్న అత్యుత్తమ పులిహోరల్లో ఒకటి అయి ఉండాలి. అది బాగోక పోయినా, సాదాసీదా గా ఉన్నా, పర్లేదే అనిపించేట్టు ఓ మోస్తరుగా ఉన్నా అది ఆనదు. షడ్రసోపేతమైన విందుభోజనాల్లాంటి మాస్ ఎంటర్‌టైనర్లని అందిస్తూన్న రవితేజ తో తీసే ఈ కథ అత్యుత్తమమైనదైతే కాదు మరి. చూడాలి జనాలు ఎంతవరకు దీన్ని ఆస్వాదిచగలుగుతారో. ఇక రెండోది- రవితేజని ప్రక్కన పెడదాం, ఇంతకీ తెలుగులో ఎలా ఉంటుంది. ఇది మనకి మరీ కొత్త కథ ఏమీ కాదు (సేతు లాగానో, ఆటోగ్రాఫ్ లాగానో) . ఆ మధ్య వచ్చిన “పరుగు”లో కూడా అల్లు అర్జున్ అచ్చు ఇలాగే జంటని బస్సెక్కించి పై జేబు లో ఉన్న డబ్బులు, కింద జేబులో ఉన్నడబ్బులూ అన్నీ తీసి ఇచ్చేసాడు- కాకపోతే అక్కడ కథ ఎవరి పాయింట్ ఆఫ్ లో చూడాలో అర్థం కాక భాస్కర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసారు జనాలు. ఇక్కడ ఆ సమస్య లేదు కానీ చాలా వరకు నత్త నడక లా సాగే ఈ కథనం తెలుగు ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.

ఈ  సమీక్ష నవతరంగం లో ప్రచురితమైంది.


Responses

  1. ఆడుతుందా అని నేనూ అనుకున్నాను. చేరన్ ఆటోగ్రాఫ్ చూసి రవితేజ ఆటోగ్రాఫ్ చూస్తే చాక్లెట్ తిని కాఫీ తాగినట్టు అనిపించింది. ఇదెలా వుంటుందో మరి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: