వ్రాసినది: mohanrazz | 2009/08/02

మగధీర ఎలా ఉంది??

 magadheera

నిన్న నే మగధీర చూసాను. తెలుగు లో ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాల్లోకీ కాస్ట్లీయెస్ట్ మూవీ అంటున్నారు. నిజమేనా లేక బిజినెస్ బాగా చేసుకోడానికి నిర్మాతలే అలా ఒక టాక్ క్రియేట్ చేసారా? రాజమౌళి కి ఇప్పటిదాకా ఫ్లాప్ రాలేదట కదా, మరి ఈ సారి ఏం చేస్తాడో? సినిమా రిలీజ్ అయిన మరునాడు ఉదయానికల్లా అన్ని వెబ్ రివ్యూస్ వచ్చేసాయి(ఇదో కొత్త సంప్రదాయం అనుకుంటా), అది కూడా అన్నీ బాగా పాజిటివ్ గా రివ్యూస్ ఇచ్చాయి. మరి నమ్మొచ్చా? ఇలాంటి ప్రశ్నల మధ్య థియేటర్ లోకి అడుగుపెట్టాను. చెప్పొద్దూ, థియేటర్ లోకి అడుగుపెడుతున్న్న మిగతా వాళ్ళలోనూ కొంచెం అటు ఇటూగా ఇదే తరహా చర్చ. మరింతకీ ఏంటి ఈ సినిమా పరిస్థితి? వివరాల్లోకి వెళితే..

కథ:

 
క్రీ.శ. 1609 లో హీరో హీరోయిన్లు చనిపోయే ఒక నాటకీయ సన్నివేశం తో కథ ప్రారంభమవుతుంది. 400 ఏళ్ళ తర్వాత తిరిగి జన్మించిన హీరో, హీరోయిన్ని కలవడం ఆమె చేతి స్పర్శ ఇతనిలో గతాన్ని స్ఫురింప చేయడం.. “నిను పొందేటందుకె పుట్టానే బొమ్మ, నువు అందక పోతే వృధా ఈ జన్మ” అన్నంత స్థాయిలో హీరో ఆమె ప్రేమ కోసం పరితపిస్తూ ఆమె వెంట తిరగడం… ఇలా ఒక లవ్ ట్రాక్ సాగుతూ ఉంటే, ఉదయఘడ్ కోటమీద హక్కుల కోసం హీరోయిన్ తండ్రికీ, వాళ్ళ బంధువులతో జరుగుతున్న కోర్టు కేసుల నేపథ్యం లో కథలోని ఇంకో పార్శ్వానికి తెరలేస్తుంది. హీరోయిన్ కి బావ వరసయ్యే రఘువీర్ ఆమె మీద కన్నేస్తాడు. వాళ్ళ కుటుంబానికి దగ్గరయేందుకు ఉదయఘడ్ కోట ని వాళ్ళకి తిరిగివ్వడానికీ సిద్దపడతాడు. అయితే తను హీరోయిన్ కి దగ్గరవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎవరో దానికి అడ్డుపడుతున్నట్టు, తనని నరికేస్తున్నట్టు అతని మెదడు లో ఏదో భయోత్పాతం. ఎందుకిలా జరుగుతోందో తెలుసుకోవడానికి ఒక అఘోరా ని కలిస్తే అతను వీళ్ళ పూర్వజన్మ వృత్తాంతం చెబుతాడు. పూర్వజన్మ లో ఆమె రాకుమారి మిత్రవింద అనీ, ఆ జన్మ లో తను ఆమెని పొందలేక పోవడానికి కారణమైన కాలభైరవ కూడా తిరిగి జన్మించాడనీ అతనున్నంత కాలం ఈ జన్మలోనూ తను ఆమెని పొందలేడనీ తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ పూర్వ జన్మ లో ఏం జరిగింది తెలియాలంటే తెరమీద చూడాలి.

ఇతరత్రా:

తీసుకున్న కథ పునర్జన్మ నేపథ్యానికి సంబంధించింది కావడం తో- కథ లో ఏం జరగబోతోందనే విషయం ప్రేక్షకులకి ముందే తెలుసు. అలాంటి తెలిసిన కథనే ఆసక్తికరంగా చెప్పడం లో రాజమౌళి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా విడుదల కి ముందు రాం చరణ్ మాట్లాడుతూ ” ఈ సినిమా ని- ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కోసం ఒకసారి చూడండి” అన్నాడు. ముమ్మాటికీ నిజం. టెక్నికల్ వాల్యూస్ పరంగా ఉన్నత స్థాయిలో ఉందీ చిత్రం. తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ వాడితే నేలక్లాస్ ప్రేక్షకుడు కూడా గుర్తుపట్టేసి, “గ్రాఫిక్స్ లేరా” అని తేలిగ్గా తీసిపారేసే స్థాయి నుండి నెమ్మదిగా గ్రాఫిక్స్ అని సులువుగా గుర్తించలేని విధంగా కథలో ఇమిడిపోయే లాగా టెక్నాలజీ ని ఉపయోగించుకునే దిశలో తెలుగు సినిమా ప్రయాణించడం శుభ పరిణామమే. డాడీ, అందరివాడు టైం లో గీతా ఆర్ట్స్ సినిమాలంటేనే విరక్తి వేసేది నాకు. చిరంజీవి లాంటి పెద్ద హీరో ని పెట్టి, సినిమా లోని మిగతా అంశాలన్నీ “డెడ్ చీప్” గా లాగించేసి, బిజినెస్ మాత్రం భీబత్సంగా చేసుకుంటారు వీళ్ళు అనిపించేది. అయితే ఈ మధ్యకాలం లో పరిస్థితులు మారినట్టుగా అనిపిస్తోంది. నిర్మాణవిలువలపరంగా ఇప్పటిదాకా వచ్చిన తెలుగుసినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా అత్యున్నత స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం వేసిన సెట్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించిన విధానం కానీ అద్భుతంగా ఉన్నాయి. అయితే అంత గొప్పగా సినిమా రావాలంటే డబ్బులు పోసే నిర్మాత ఒక్కడుంటే సరిపోదు, అత్యుత్తమమైన టెక్నికల్ టీమ్, ఆ టెక్నికల్ టీమ్ నుంచి ఔట్ పుట్ రాబట్టుకోగల దర్శకుడు కావాలి. జక్కన్న గా ఇండస్ట్రీ లో పిలవబడే రాజమౌళి “సృజనాత్మకమైన గొప్ప” సినిమాలు తీసిఉండకపోవచ్చు కానీ, తన పరిధి అయిన “కమర్షియల్ తెలుగు సినిమా” లో తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకుని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం లో తాను నంబర్ వన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

కథాపరంగా ఇది ‘తెలుగు సినిమా’ని ముందుకు తీసుకెళ్ళే కథేమీ కాదు. కమర్షియల్ సినిమాల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించినా కూడా, ఆరుంధతి సినిమా కథ తో కొద్దిపాటి పోలికలు కనిపిస్తాయి. అయితే షుమారు రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభమై, దాదాపు రెండొందల డెబ్బై పనిదినాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కథకి, ఆర్నెల్ల క్రితం రిలీజ్ అయిన ఆరుంధతి కథతో పోలికలుండటం బహుశా కాకతాళీయం కావచ్చు. కథాపరంగా ఇది తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్ళే కథ కాకపోవచ్చు కానీ, మేకింగ్ స్టాండర్డ్స్ పరంగా తెలుగుసినిమాల్లో బెంచ్ మార్క్ లా మిగిలిపోయే సినిమా లో ఒదిగిపోయే కథే.

ఇక నటీనటుల విషయానికి వస్తే, రామ్ చరణ్ కి ఇది రెండో సినిమా. సినీ వారసులకి సాధారణంగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి పరిచయమైపోయాక సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెట్టి, “స్టే కనెక్టెడ్” ప్రోగ్రాం కింద కాస్త మంచి దర్శకులని ఎన్నుకుంటూ రెగ్యులర్ గా సినిమాలు తీస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఒక బ్లాక్ బస్టర్ తగులుతుంది. అయితే రెండో సినిమా కే కేవలం దర్శకుడి ప్రతిభమీదే ఆధారపడి కాకుండా నటుడిగా ప్లస్ హీరోగా తననుంచి ఎన్నో రకాలు గా ఎంతో డిమాండ్ చేసే పాత్ర దొరకడం ఒకరకంగా తన అదృష్టం అని చెప్పాలి. ఆ అవకాశాన్ని తను కూడా సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. హార్స్ రైడింగ్ , వీరోచిత దృశ్యాలూ చాలా బాగా చేసాడు. ఇక డ్యాన్సులూ ఫైట్లూ సరేసరి. ఇక నటనకూడా ఎక్కడా వంక పెట్టే విధంగా లేదు. షేర్ ఖాన్ గా నటించిన శ్రీహరి పాత్ర తెరమీద కనిపించేది ఓ పదిహేను నిమిషాలే అయినా కీలకమైన పాత్ర. శ్రీహరి ఆహార్యం, ఆ పాత్రని శ్రీహరి పోషించిన విధానం చాలా బాగున్నాయి. కాజల్ బాగా చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రాకుమారిలానే ఉంది. విలన్ గా నటించిన దేవ్ గిల్ బాగా చేసాడు. అయితే ఒక పాత్రని “వీడు విలన్” అని ప్రేక్షకులకి చెప్పడానికి ఆ పాత్ర ని పరిచయం చేసిన వెంటనే ఉత్తిపుణ్యానికి ఎవణ్ణో ఒకణ్ణి ఆ పాత్రచేత చంపించే తెలుగు సినీ సాంప్రదాయం ఈ సినిమాలోనూ కొనసాగింది.

చాలామంది సినీప్రియలకి ఛత్రపతి సెకండాఫ్ నరకమనిపించుడొచ్చు గాక, చాలామంది విశ్లేషకులని సింహాద్రి భయపెట్టిఉండొచ్చుగాక, విక్రమార్కుడు సినిమా మాస్ చిల్లరకామెడీ గా ఎలైట్ ప్రేక్షకు తీసిపారేసి ఉండొచ్చు గాక, సినిమా సినిమా కి తన రేంజ్ పెంచుకుంటూ మాస్ సినిమాలు తీయడం లో తాను సిద్దహస్తుణ్ణని నిరూపించుకున్న రాజమౌళి ఈసారి తన ట్రేడ్ మార్క్ బూతుకామెడీకి ఆస్కారమివ్వకుండా, విచ్చలవిడి రక్తపాతాన్నీ ఆరబోయకుండా (రిలేటివ్ గా), గ్రాండ్ స్కేల్ లో తీసిన ఈ సినిమా అటు సాధారణ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకొనేలానూ ఉంది, ఇటు కూసింత ధైర్యంగా మీ నాన్-తెలుగు స్నేహితులకి చూపించదగ్గదిగానూ ఉంది.

 సమీక్ష నవతరంగం లో ప్రచురితమైంది.

ప్రకటనలు

Responses

  1. ఒక్క మైనస్ పాయింట్ ఏమిటంటే – జూనియర్లు సీనియర్లు అని తేడాలేకుండా అందరూ ఒత్తుల్లేకుండా మాట్లాడటం. భైరవను ఒత్తు తీసేసి బైరవ అని అల్పప్రాణిని చెయ్యడం. డిక్షన్ మీద శ్రద్ధ లేకపోతే చారిత్రక పౌరాణిక సంభాషణలే కాదు మామూలు మాటలు కూడా పేలవంగా అనిపిస్తాయి. ఈకాలం హీరో ఆజానుబాహుడు అవనక్కర్లేదుగానీ, మాట సరిగా పలికేవాడైనా అయితే బాగుంటుంది కదా. 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: