వ్రాసినది: mohanrazz | 2009/08/10

సమీక్షకుడు కథకుడు కాలేడా?

అప్పుడెప్పుడో “భారతీయుడు” సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఒక సమీక్ష చదివా ఆ సినిమా గురించి. అందులో సమీక్షకుడు ఒక మంచి పాయింట్ పట్టుకున్నాడు. గ్యాస్ స్టవ్ పేలి కూతురికి విషమ పరిస్థితుల్లో ఉన్నపుడు ఆ కూతురికి వైద్యం కోసం వెళ్తాడు కమల్ హాసన్. అక్కడ లంచం అడుగుతారు. లంచం ఇవ్వను అని కమల్ హాసన్ అంటే “సరే అయితే రూల్ ప్రకారం పోలీస్ కేస్ పెట్టి ఆ ఎఫ్.ఐ.ఆర్ కాపీ తీసుకురమ్మ”ని చెప్తారు. అక్కడికెళ్తే అక్కడా లంచం గొడవే. “ఎందుకవ్వాలయ్యా లంచం” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వాళ్ళు ముసలాయన చాదస్తాన్ని అపసహించి “అయితే మేమూ రూలు ప్రకారమే వెళ్తాం” అని అలా రూలు ప్రకారం వెళ్ళి అన్నింట్లోనూ ఆలస్యం అయేలా చేసి ఆ పిల్ల ప్రాణాలు బలిగొంటారు. అప్పుడు కమల్ హాసన్ దేశం లో వేళ్ళూనుకున్న “లంచం” అనే మహమ్మరి మీద తనదైన పోరాటం ప్రారంభిస్తాడు. ఇదంతా అందరికీ తెలిసిన కథే. అయితే ఆ సమీక్షకుడు పట్టుకున్న అంశమేంటంటే, కూతురికి ఫైర్ యాక్సిడెంట్ అయి ఆస్పత్రికి వెళ్తేగానీ దేశం లో ఈ లంచం అనే మహమ్మారి క్యాన్సర్ లా వేళ్ళూనుకున్న విషయం కమల్ హాసన్ కి తెలీనట్టే దర్శకుడు చూపించాడు. కూతురికి ఆ పరిస్థితి వచ్చేంత వరకూ కమల్ కి దేశం లోని పరిస్థితులూ, లంచం గురించే తెలీదా? సరే, ఆయన ఏదో రిమోట్ విలేజ్ లో పచ్చని చిలుకలు తోడుగా, పాడేకోయిల వెంట హాయిగా జీవితం గడుపుతున్నాడు కాబట్టి ఆయనకి దేశం లోని పరిస్థితుల గురించి పూర్తి అవగాహన లేదూ అందామా అంటే ఆయన స్వాతంత్ర్య సమరయోధుడాయె. స్వాతంత్ర్య సమరయోధుడై ఉన్న వ్యక్తికి దేశం లోని ఇవాళ్టి పరిస్థితుల గురించి తెలీదు అంటే అది హాస్యాస్పదం. ఇదీ ఆ సమీక్షకుడి సందేహం. వాలిడ్ పాయింటే. శంకర్ లాంటి గొప్ప కథకుడి కథలోని లూప్ హోల్ ని చక్కగా పట్టుకోగలిగిన ఆ సమీక్షకుడి విమర్శనాత్మక దృష్టి అభినందించదగ్గదే. కానీ ఇక్కడే నాకొక సందేహం వచ్చింది. ఒకవేళ భారతీయుడు లాంటి కథ బేసిక్ ఐడియా ఆ సమీక్షకుడికి వచ్చివుంటే ఏనాటికైనా ఆయన దాన్ని పూర్తి స్థాయి కథ గా డెవలప్ చేయగలిగి ఉండేవాడా అనేదే ఆ డౌట్. ఎందుకంటే మామూలుగా కథారచయితలకే కొన్ని stumbling blocks ఉంటాయి. అలా ఏదైనా ఒక బ్లాక్ అడ్డు వచ్చిందంటే అది ఎంతకీ తెమలక కథ ముందుకి కదలదు. ఒక వేళ ఒక సమీక్షకుడికో, విమర్శకుడికో ఒక బేసిక్ స్టోరీలైన్ తట్టినపుడు వాళ్ళు దాన్ని కథగా మార్చే క్రమం లో ఈ రైటర్”స్ బ్లాక్ లు వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటాయేమో అనిపిస్తుంది.

సూత్రధారులు అని ఒక కె.విశ్వనాథ్ సినిమా వచ్చింది. అందులో ఒక అత్యద్భుతమైన డ్రామటిక్ సన్నివేశం ఉంటుంది. భానుచందర్ కలెక్టర్ అయి వాళ్ళ జిల్లాకే వచ్చినపుడు, ఊరిజనమంతా భానుచందర్ కి ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగిస్తూ ఒక సన్మానం లాంటిది చేస్తారు. బయట జనం జేజేలు పలుకుతూంటే అవి చూసి ఆనందం తో ఉప్పొంగిన వాళ్ళ అమ్మ సుజాత, తన భర్త అయిన నాగేస్వరరావు గారిని ఇంట్లోకి పిలుచుకెళ్ళి తలుపేసి, ఒక ముద్దుపెట్టి, “ఎలాంటి కొడుకునిచ్చావయ్యా” అని ఆనంద భాష్పాలతో అంటుంది. కథలో లీనమై సినిమా చూసినవాళ్ళకి కొన్నేళ్ళపాటు గుర్తుండిపోయేంత అద్భుతంగా ఉంటుందా సీన్. అయితే ఒక విమర్శకుడు/సమీక్షకుడు “మనకున్న రూల్స్ ప్రకారం ఏ వ్యక్తికీ సివిల్స్ క్లియర్ చేసిన వెంటనే తన స్వంత జిల్లాకి కలెక్టర్ గా వచ్చే అవకాశం లేదనీ, కళాతపస్వి స్థాయి దర్శకుడికి ఈ చిన్నవిషయం తెలీకపోవడం ఆశ్చర్యకరంగా ఉందనీ” అన్నాడు. మళ్ళీ ఇది కూడా వాలిడ్ పాయింటే. బహుశా నిజంగానే కె.విశ్వనాథ్ గారికి ఆ పాయింట్ తెలీకపోయివుండొచ్చు. ఒకవేళ ఆ రూల్ తెలిసి ఉంటే, అంత అద్భుతమైన సన్నివేశాన్ని ఆయన వ్రాసుకోలేక పోయివుండేవాడేమో!అందుకే కొన్నిసార్లు అనిపిస్తూంది కథారచయితకి కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ కూడా కలిసి వస్తుందేమోనని. కోర్టులో ముద్దాయిలకి అరిచి గాండ్రించి డైలాగులు చెప్పే అవకాశం ఉండదని తెలిసిఉంటే NTR నటించిన బెబ్బులి పులి సినిమా క్లైమాక్స్ లో అంత పవర్ ఫుల్ డైలాగులు అంత కాన్‌ఫిడెంట్ గా వ్రాసేవాడు కాదేమో దాసరి అనిపిస్తుంది నాకు. ఒకవేళ ఈ రూల్ గురించి పూర్తిస్థాయి అవగాహన ఉండిఉంటే ఖచ్చితంగా అదొక stubling block గా నసపెట్టి ఉండేది దాసరిగారికి. ఇలాంటి రూలే ఒకటి మణిరత్నం “నాయకుడు” సినిమా గురించి చెబుతారు. ఇందులో కమల్ హాసన్ మొదట్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని చంపుతాడు. ఆ తర్వాత మానసిక వికలాంగుడైన అతని కొడుకు ని తనదగ్గరే పెంచుతాడు. చివరికి అతనికి తనతండ్రిని చంపింది కమలేనని తెలిసాక ఇంటికి వెళ్ళి తన తండ్రిదైన పాత ట్రంక్ పెట్టె తీసి, అందులోని తన తండ్రి బట్టలు వేసుకుని ఆయన రివాల్వర్ తీసుకుని కమల్ ని చంపేస్తాడు. అయితే “రూలు ప్రకారం” ఆ రివాల్వర్ ని డిపార్ట్ మెంట్ హ్యాండోవర్ చేసుకోవాలి కదా అనేది విమర్శకుల ప్రశ్న. నిజానికి మణిరత్నం, ఆ మానసిక వికలాంగుడు తనతండ్రి పెట్టె తీసి అందులోని బట్టలు వేసుకోవడం, అందులోని రివాల్వర్ తీసుకున్నట్టు చూపించడం ద్వారా ఆ సీన్ లో ఒకతరహా డ్రామాని క్రియేట్ చేయగలిగాడు. రూల్ స్పష్టంగా తెలిసిన సమీక్షకులు/విమర్శకులు అలాంటి సీన్ ని ఎన్నటికీ వ్రాయలేరేమో.

ప్రొఫెషనల్ సమీక్షకుడి పనే సినిమాని విమర్శనాత్మకంగా చూసి పలురకాలుగా విశ్లేషించి వ్రాయడం కాబట్టి, బహుశా అతనికి తెలీకుండానే అతని మెదడు లాజిక్ కి, రూల్స్ కి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు చేసుకుంటుంది. అందువల్ల అతను ఏదైనా కథని డెవలప్ చేద్దామనుకున్నపుడు రైటర్స్ బ్లాక్ అతన్ని ఇబ్బందిపెట్టే అవకాశాలు ఎక్కువేమో అనిపిస్తుంది. విమర్శకుడిగా ఉంటూ “క్రియేటర్” గా మారే ఉద్దేశ్యం ఏ మాత్రం లేనివాళ్ళకి ఇబ్బందేమీ లేదు. కథకుడిగా కూడా ప్రయత్నించాలనుకున్నపుడే ఇబ్బంది. ఎంతోమంది మహామహులైన దర్శకుల్ని సైతం తన రివ్యూల్లో నిర్దాక్షిణ్యంగా ఏకిపారేసి, ఆ తర్వాత దర్శకుడిగా మారినపుడు ఖాలిద్ మొహమ్మద్ గురించి “ఈయన ఏ మాత్రం తీస్తాడో మేమూ చూస్తాం కదా” అనే అన్నారు బాలీవుడ్ మహామహులు. వారూహించినట్టుగానే ఫిజా సినిమా యావరేజ్ అయినప్పుడు “చెప్పినంత సులభం కాదమ్మా సినిమా తీయడం” అనీ అన్నారు. ప్రొఫెషనల్ రివ్యూయర్ కాకపోయినా ప్రతిసినిమాని విపరీతమైన లాజిక్ తో చూస్తూ అన్ని సన్నివేశాలూ రూల్సుననుసరించే ఉండాలన్నట్టు సమీక్షా దృక్పథం తో సినిమా చూసేవాళ్ళకి రైటర్స్ బ్లాక్ బెడద తప్పకపోవచ్చు!!


Responses

 1. మీ post ఆసక్తికరంగా వుంది. ఇలాంటివి ఇంకా వ్రాస్తూవుండండి.

 2. EXCELLENT POINTS .. RGV is the right person to answers those critics.

  విశ్లేషకులలో నాకు నచ్చనది ఏమిటంటే సినిమా వుద్దేశం, మేకర్స్ వుద్దేశం పూర్తిగా విస్మరించడం.

 3. ఉత్ప్రేక్ష, అతిశయం లేని సినిమాను తీయడం, చూడటం రెండూ దండగమారి పనులేనని శాస్త్రం. 🙂

  Don’t be afraid to exaggerate అనేది సినిమా సన్నివేశ రచన చేసే యువకులకు వారి గురువులు చెప్పేమాట అని ఒక మిత్రుడు నాతో చెప్పాడు. సరిగ్గా ఇదేమాట ఇటీవల కమల్ హాసన్ బృందం ఆధ్వర్యంలో జరిగిన వర్కుషాపులో ఒకాయన చెప్పాడు.

  ఉద్యోగమివ్వగానే సొంత ప్రాంతానికి కలెక్టరుగా వెయ్యకూడదనేది రూల్ కాదు, సంప్రదాయం అనుకుంటాను. జయప్రకాశ్ నారాయణ జీటీవీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు ఈ సంప్రదాయాన్ని జేపీ గుర్తు చేయాల్సివచ్చిందట. యూట్యూబులో వీడియోలు దొరకవచ్చు.

 4. “సినెమాటిక్ లిబర్టీ” అనే ఒక పదముందిలెండి!

 5. మీరు ఛెప్పిన్ది చాలా correct. కొంతమన్ది అర్ధమ్ లెని విమర్సలు చెస్తారు. విపరితమైన రంద్రన్యెషణ్దం ఛెస్తారు. ఎందుకొ తెలిదు. ఎంత పెద్ద దర్సకులు అయినా, నటులు అయినా కొన్ని లొపాలు ఉంటాయి. చివరకు రామయణ్ం, భారతం లాంటి కూడా లొపాలు వుంటాయి వెదికిటతె.

 6. sameekshakudu ki meeru raasina sameekshakudiki chaala difference vundi…………
  loop holes pattukovatame sameekshakuni work ayite andaru chaala manchi critics anukunta especially mana blog world too many people…….

 7. సమీక్షకు, విమర్శకు, విమర్శనకు, విశ్లేషణకు సున్నితమైన తేడాలే అయినా, తేడా మాత్రం ఖచ్చితంగా ఉంది.

  అలాగే, సీన్ ను ప్రభావవంతంగా చెప్పడానికి దర్శకుడు తీసుకునే స్వేఛ్ఛ (సినెమాటిక్ లిబర్టీ)కి, సరైన హోంవర్క్ లేక జరిగే “గూఫ్ అప్” లకీ తేడా ఉంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: