వ్రాసినది: mohanrazz | 2009/08/12

ట్రిస్కాడెకా ఫోబియా

అంటే 13 అనే సంఖ్య అంటే భయపడే ఒక ఫోబియా అన్నమాట. నిజానికి 13 అనే సంఖ్యకి చాలా మంది ఫారినర్స్ భయపడుతూ ఉంటారు. చాలా కారణాల వల్ల ఆ సంఖ్యని అన్ లక్కీ అని డిసైడ్ చేసారు. మనకి అవన్నీ తెలీదు. చిన్నప్పుడెప్పుడో ఇంటి నంబర్ 13 అని ఒక హారర్ సినిమా చూసాం. కథ గుర్తు లేదు కానీ, 13 అంటే డేంజరేమో అనే ఫీలింగ్ మొదట వచ్చింది అప్పుడే. మన ఇండియన్ హారర్ సినిమాల్లో కూడా అప్పుడప్పుడూ 13 ని అలా టచ్ చేస్తూ ఉంటారు. కెనడా వెళ్ళినపుడు అక్కడ హోటల్ లో రూం నంబర్ 13 కానీ, 113 కానీ, 213 కానీ ఏవీ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఆఖరికి లిఫ్ట్ లో కూడా 12వ ఫ్లోర్ తర్వాత 14వ ఫ్లోర్ అని చూసి నవ్వొచ్చేది. సాధారణంగా ఇలాంటివి పెద్దగా నమ్మని నేను కూడా ఒకానొక సమయం లో 13 అనే సంఖ్య అంటే కొంచెం భయపడే స్థాయికి వచ్చేలా కొన్ని సంఘటనలు జరిగాయి.

పుణె లో ఉన్నపుడు అప్పట్లో ఒకసారి రూమ్ మారాల్సొచ్చింది. వెతకగా వెతకగా ఆఫీస్ కి దగ్గర్లో ఒక ఫ్లాట్ దొరికింది. ఫ్లాట్ నంబర్ 13, బిల్డింగ్ A3. అయితే ఓనర్ చిన్నమెలిక పెట్టాడు. తనకి ప్రస్తుతం డబ్బు అర్జంటుగా అవసరం ఉందని, అందువల్ల 11 నెలల రెంట్ ముందే ఇవ్వాలి అని, ఆ తర్వాత ఇక నెల నెలా ఏమీ కట్టక్కర్లేదని. ఆలోచించాము. మామూలుగా అయితే ఐదారు నెలల రెంట్ అడ్వాన్స్ గా ఇచ్చి, ఆ తర్వాత ప్రతి నెలా రెంట్ ఇవ్వాలి. సరే, అంతా ఒకటేలే అని 11 నెలల అద్దె ముందే ఇచ్చేసి ఆ తర్వాత ఇంకేమీ కట్టక్కర్లేదనే రూల్ కింద అగ్రిమెంట్ చేసుకుని ఇంట్లో చేరిపోయాము. దేశముదురు సినిమా లో ఆలీ డైలాగ్ ఒకటుంటుంది- “నా స్టోరీ లో ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది” అని. దాని సంగతేమో కానీ మాకు మాత్రం ఆ ఇంట్లో ప్రతిరోజు క్లైమాక్స్ లా ఉండేది. ఇంట్లో జాయినయిన మరునాడు కరెంట్ ఆఫీస్ నుంచి అని ఎవరో వచ్చి పవర్ కట్ చేసి వెళ్ళి పోయారు. పాత కరెంట్ బిల్స్ ఏవైనా కట్టలేదేమోనని ఓనర్ కి ఫోన్ చేసాం. సాయంత్రానికల్లా ఓనర్ వచ్చి, కరెంటాఫీస్ నుంచి ఆ మనిషిని పట్టుకొచ్చి మళ్ళీ రూమ్‌కి కనెక్షన్ ఇప్పించి మాకు మాత్రం చిన్న షాక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి మీటర్ లేదు. అఫీషియల్ గా కరెంట్ సప్లై లేదు. సొసైటీ కి వచ్చే కరెంట్ నుంచి ఒక లైన్ ఇల్లీగల్ గా కలిపారు. కరెంట్ ఆఫీస్ తో చిన్న ప్రాబ్లెం వచ్చి మీటర్ లేపేసారని చెప్పాడు. ఇదేమి ట్విస్ట్ రా బాబూ అనుకుంటూ, అయినా మీటర్ కూడా చూసుకోకుండా ఇల్లు తీసుకున్నందుకు మమ్మల్ని మేము తిట్టుకుంటూ సర్లే సర్దుకుపోదామనుకున్నాం. ఆ తర్వాత మరుసటి రోజు మా ఓనర్ కోసమని ఎవరో వచ్చారు. ఆయన ఫోన్ నంబర్ అడిగితీసుకున్నారు. వెళ్తూ వెళ్తూ “మీ ఓనర్ చాలా డేంజర్ క్యాండిడేట్” కొంచెం జాగ్రత్త గా ఉండండి అని చెప్పి వెళ్ళారు. మాకేమీ అర్థం కాలేదు. బెల్లం కొండ సురేష్ లాంటి పర్సనాలిటీ తో ఉండి కొంచెం మొహమాటస్తుడిలా కనిపిస్తాడు మా ఓనర్. ఈయన తో డేంజర్ ఏంటి అనుకున్నాం. తర్వాత మా ఓనర్ కాల్ చేసి, “ఎవరు పడితే వాళ్ళకి నా మొబైల్ నంబర్ ఇవ్వకండి, అంతగా అడిగితే లాండ్ లైన్ నంబర్ ఇవ్వండి” అన్నాడు. క్యాండిడేట్ బాగా అప్పుల్లో ఉన్నాడని అర్థమయింది. ఆ తర్వాత కూడా రోజూ ఎవరో ఒకరు రావడం, నంబర్ అడగడం, మేము లాండ్ లైన్ నంబర్ ఇవ్వడం..అలా ఓ నాలుగు రోజులు గడిచింది.సర్లే, ఎక్కడికెళ్ళినా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని సర్దుకుపోయాం. అయితే మొదట వచ్చిన ఈ రెండుమూడు ఇబ్బందులు ట్రైలర్లేనని, అసలు సినిమా ముందుందని అప్పటికి మాకు తెలీదు. 

ఓ రోజు ఏదో బ్యాంక్ నుంచి కొంతమంది వచ్చారు. మా ఓనర్ గురించి అడిగారు. ఆల్‌రెడీ చాలా నోటీసులు పంపించామనీ చెప్పారు. ఓ వారం రోజుల్లో ఫ్లాట్ సీజ్ చేస్తామని చెప్పారు. మేము రెంట్ కి ఉంటున్నామంటే, వీలయినంత త్వరగా వేరే ఫ్లాట్ చూసుకోండి లేదంటే చివర్లో మళ్ళీ మీరే ఇబ్బందిపడతారు అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ ఓనర్ కి ఫోన్ చేసాం. వచ్చాడు.విషయం చెప్పాం. “ఈ ఇంటి మీద చిన్న కేస్ ఒకటి నడుస్తోంది. నేను చూసుకుంటాను, మీరేమీ టెన్షన్ పడొద్దు. అయినా ఈ బ్యాంక్ మేనేజర్ మారినప్పుడల్లా నాకు ఇదొక పంచాయితీ అయిపోయింది. మీరేమీ టెన్షన్ పడొద్దు” అని చెప్పి వెళ్లిపోయాడు. అనవసరంగా ఈ ఫ్లాట్ లో చేరామనే ఫీలింగ్ మాకూ స్టార్టయింది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లెం వచ్చి ఖాళీ చేయాల్సి వచ్చినా ఈ ఓనర్ మా 11 నెలల అడ్వాన్స్ మాకు వెనక్కి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు.  మరుసటి రోజు ఓనరే ఫోన్ చేశాడు. “మా వైఫ్ కి హెల్త్ చాలా బాగా లేదు, నేను హాస్పిటల్ దగ్గరే ఉన్నాను. ప్రస్తుతానికి చేతిలో డబ్బు ఏమీ లేదు. కొంచెం డబ్బు అరేంజ్ చేస్తారా, మీకు మళ్ళీ ఒకట్రెండు రోజుల్లో అడ్జస్ట్ చేసిస్తాను” అన్నాడు. అంతకుముందెవరో, “మీ ఓనర్ చాలా డేంజర్” అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూంటే, మళ్ళీ తనే అన్నాడు “మీకేమైనా డౌటుంటే ఒకసారి ఫలానా హాస్పిటల్ దగ్గరికి రమ్మ”న్నాడు. ఒక నెల రెంట్ కి సమానమైన డబ్బిచ్చాం. రెండ్రోజుల తర్వాత ఒక చాయ్ సెంటర్ దగ్గరికి రమ్మన్నాడు. మన డబ్బులిస్తాడేమోనని వెళ్ళాం. చాయ్ తాగుతూ సమయానికి డబ్బులిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు. వాళ్ళ వైఫ్ హెల్త్ ఇప్పుడు పర్లేదని చెప్పాడు. రెంట్ కి ఉన్న మాలాంటి వాళ్ళదగ్గర అప్పడిగినందుకు సారీ చెప్పాడు. అసలు ఈ ఫ్లాట్ కొనక ముందు తాను దర్జా గా ఉండేవాణ్ననీ, ఈ ఫ్లాట్ కొన్నాకే శని పట్టుకుందనీ చెప్పాడు. ఒకప్పుడు పుణె లో నాలుగు ఫ్లాట్లు, ముంబై లో ఒక ఫ్లాట్, రెండు కార్లు తనకి ఉండేవని, అసలు అప్పట్లో తన దర్జా జీవితం గురించి మీ అపార్ట్మెంట్ లో ఎవర్ని అడిగినా చెప్తారని అన్నాడు. ఈ ఫ్లాట్ నంబర్ లోనే తిరకాసంతా ఉందన్నాడు. ఫ్లాట్ నంబర్ 13. అది ఒక డేంజర్ సిగ్నల్ అయితే బిల్డింగ్ నంబర్ A3. A మొదటి అక్షరం కాబట్టి దాని విలువ 1 అనుకుంటే ఇది ఇంకో 13 అవుతుంది. కాబట్టి డబల్ డేంజర్ అన్నాడు. అయినా మీకేమీ కాదులే టెన్షన్ పడకండి. మీ డబ్బు మాత్రం ఇంకో వారం రోజుల్లో వెనక్కి ఇచ్చేస్తానని అన్నాడు. ఏంటో ఒక సారి పాపం లే మంచోడే అనిపిస్తాడు, ఒక్కోసారి ఖతర్నాక్ అనిపిస్తాడు మా ఓనర్. అయినా ఈ 13 నంబర్ నిజంగా డేంజరా లేకపోతే మూఢనమ్మకమా అని మాట్లాడుకుంటూ ఆ రోజు కి నిద్రపోయాం. మర్నాడు మా రూం మేట్ చేస్తున్న IT జాబ్ కాంట్రాక్ట్ ఫినిష్ అవడం. 99.99%  ఎక్స్టెండ్ అవుతుందనుకున్న జాబ్ పోవడం జరిగాయి. మా వాడికి కూడా ఇది రూం ఎఫెక్టా అని డౌట్ స్టార్టయింది. ఆ తర్వాత రెండ్రోజులకి మా తమ్ముడికీ ఇదే పరిస్థితి ఎదురయ్యేసరికి రూం ఎఫెక్టే అని మేమూ స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాం. మధ్యాహ్నానికి మళ్ళీ బ్యాంకు వాళ్ళు రెడీ అయిపోయారు. సాయంత్రానికి మళ్ళీ చాయ్ సెంటర్ లో సమావేశం. ఓనర్ పక్కనే ఎవడో లాయర్ కూడా వచ్చాడు. చాయ్ సిప్ చేసాక ఫ్లాష్ బాక్ విప్పాడు మా ఓనర్. తన ఫ్రెండ్ ఒకడికి బిజినెస్ చేసుకోడానికి లోన్ అవసరమైతే తాను ఈ ఫ్లాట్ ని ష్యూరిటీ గా పెట్టి సైన్ చేసినట్టూ, ఆ తర్వాత ఆ ఫ్రెండ్ ని ఎవరో మర్డర్ చేస్తే ఆ లోన్ తనకి చుట్టుకున్నట్టు చెప్పాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళు కూడా డబ్బు తిరిగి ఇచ్చే పరిస్థితుల్లో లేనట్టు చెప్పి ఫినిషింగ్ ఇచ్చాడు. బ్యాంక్ వాళ్ళతో తన కేస్ ఈ వారం హియరింగ్ ఉందని చెప్పాడు. లాయర్ ఏవో డాక్యుమెంట్స్ చూపించి మాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఏమిరా ఈ టార్చర్, అనవసరంగా ఇరుక్కున్నాం అనిపించింది. మా ఫ్రెండ్ కూడా ఈ రూం లో నుంచి ట్రై చేస్తుంటే ఎంతకీ జాబ్ దొరకడం లేదు, మారిపోదాం అంటున్నాడు. కాకపోతే ఈ ఓనర్ మా డబ్బులిస్తాడో ఇవ్వడో అని టెన్షన్. అప్పటికి ఆ రూం కి వచ్చి దాదాపు 3 నెలలు అయింది. 11 నెలల అద్దె ఇచ్చి దిగాం. 3 నెలలది పోతే ఇంకో 8 నెలలది ప్లస్ అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఇచ్చిన డబ్బులు. హియరింగ్ అయ్యాక ఫ్లాట్ సీజ్ చేయడం ఖాయమైపోయింది. సర్లే మేం ఖాళీ చేస్తాం, డబ్బులు సర్దండని చెప్పాం. అన్నామే కానీ ఇటూ మాకూ ఇల్లు దొరకలేదు వెంటనే. మీరు కావాలనుకుంటే మా ఇంటికొచ్చి ఉండండి అన్నాడు. అది మా ఆఫీస్ కి 20 కి.మీ. దూరం. దారి చాలా వరస్ట్. దాని బదులు ముంబై నుంచి పుణె కి అప్ అండ్ డౌన్ చేయడం సులభం.సరే మా లగేజ్ మీ ఇంట్లో పెట్టి మేము వేరే ఫ్రెండ్స్ రూం లో అడ్జస్ట్ అవుతాం ఫ్లాట్ దొరికేవరకూ అని చెప్పాం. సరే అయితే, ఇప్పుడు మీకివ్వాల్సిన దాంట్లో సగం డబ్బులే ఉన్నాయి, మిగతా సగం ఆ లగేజ్ తీసుకెళ్ళేటపుడు ఇస్తా అన్నాడు. మ్యాటర్ అర్థం అయింది. మొత్తానికి ఇల్లు ఖాళీ చేసాం. లగేజ్ తీసుకెళ్ళి వాళ్ళింట్లో పడేయడానికి వెళ్ళాం.

మరీ చిన్న ఇల్లు. మా 1బెడ్రూం ఫ్లాట్ లో సగం ఉంటుందేమో. లగేజ్ అవీ ఎక్కడెక్కడ పెట్టాలో చూపించాక కాఫీ ఇచ్చారు. ఆ తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ లో బ్యాలెన్స్ ఎపిసోడ్ మొదలెట్టాడు. ఓ ఇరవై-పాతికేళ్ళ క్రిందటి ఫిల్మ్ మేగజైన్స్ కొన్ని తెచ్చి మా ముందు పడేశాడు. ఫిల్మ్ ఫేర్ కాదు కానీ అలాంటిదే ఏదో పాత మేగజైన్. తీసి ఒక పేజ్ చూపించాడు. స్టన్ అయ్యాం. ఆశా భోంస్లే పక్కన ఈయన. ఇంకొన్ని ఫోటోస్ చూపించాడు. మైగాడ్! ఈయన బాలీవుడ్ ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తీశాడు. శేఖర్ సుమన్ హీరో గా పరిచయం చేస్తూ ఆయన తీసిన ఆ సినిమా ఇప్పటికీ రిలీజవలేదు. ప్రక్కన హీరోయిన్ ఎక్కడో చూసినట్టుంది, గుర్తు రావట్లేదు. పేరు లంబా అని వ్రాసి ఉంది. ఈయన, డైరెక్టర్ కుర్చీ లో కూర్చుని ఉంటే, శెఖర్ సుమన్, లంబా ఇంకా మిగతా ఆర్టిస్ట్ లు అందరూ నుంచొని ఉన్న ఫోటో ఒకటి చూపించాడు. ఆ హీరోయిన్ ఫోటో ని కొంచెం పరీక్షగా చూసిన మా ఫ్రెండ్ గుర్తు పట్టి అడిగాడు, “ఈమె మల్లికా షరావతా?” “అవున”న్నాడు మా ఓనర్. అప్పుడామెకి 16 యేళ్ళుంటాయన్నాడు. నా సినిమా ద్వారా పరిచయం అవ్వాల్సింది. మిస్సయ్యింది. తర్వాత పేరు మార్చుకుని మళ్ళీ వచ్చింది అని చెప్పాడు. ఇంతకీ సినిమా ఏమైంది మరి అని అడిగాము. ఒక సిడి తీసి చూపించాడు. ఇందులో ఉంది కావాలంటే తీసుకెళ్ళి చూడమన్నాడు. ఏదో సెన్సార్ ప్రాబ్లెం వస్తే అప్పట్లో కొంతమంది మిస్ లీడ్ చేయించి కోర్ట్ లో కేస్ వేయించారట. ఆ కేస్ తెమలక, సినిమాకి సెన్సారవక, ఉన్న డబ్బంతా పోగొట్టుకుని, ఆస్తంతా హరించుకుపోయి, ఊరిచివర్న ఒక చిన్న ఇంట్లో ఉన్నాడిపుడు. ఇరవయ్యేళ్ళ క్రింద రెండు కోట్లు నష్టపోయాను ఈ సినిమా తీయడం వల్ల అన్నాడు. ఆ సినిమా మొదలెట్టాకే ఈ 13వ నంబర్ ఫ్లాట్ కొన్నాట్ట. ఈ ఫ్లాట్ వల్లే నాకీ అరిష్టం అంటాడు. ఆ తర్వాత మాకివ్వాల్సిన డబ్బులు ఒక సంవత్సర కాలం పాటు అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఒక ఇరవై ఇన్స్టాల్ మెంట్ల లో ఇచ్చాడు. అయితే ఆ తర్వాత నాక్కూడా కొంచెం 13 అంటే డేంజర్ అనే ఫీలింగ్ మొదలైంది. కొంతకాలం పాటు 13 వ నంబర్ ఫ్లాట్లు, షాపింగ్ మాల్ బయట లగేజ్ కౌంటర్ లో 13వ నంబర్ టొకెన్ లు, ఇంపార్టెంట్ పనులు 13 వ తేది మొదలెట్టడాలూ అవాయిడ్ చేసాను. అయితే 13 మీద నా కోపం మరీ ఎక్కువ రోజులు నిలవలేక పోయింది. ఎందుకంటే బేసిగ్గా నాకు ఈ 13 అనే నంబర్ అంటే మొదట్నుంచీ ఎందుకో కొంచెం ఇష్టం. బహుశా నా పుట్టిన రోజు కూడా (ఆగస్ట్) 13వ తేదీ కావడం కూడా అందుకు కారణం అయివుండొచ్చు 🙂


Responses

 1. ప్చ్!

 2. 13తో మీ అనుబంధం బాగుంది.

  HAPPY BIRTHDAY TO YOU !

  • thanks boss..

   ఇంకో విషయమేంటంటే బ్లాగ్ హిట్స్ ఈరోజే 13000 టచ్ చేసింది 😀

 3. మీ వ్యాసం బాగునన్నాది. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  మీ బ్లాగు రోజు చదువుతూ ఉంటాను. బాగా రాస్తున్నారు. keep writing.

 4. Many many happy returns of the day!!!

 5. పుట్టినరోజు శుభాకాంక్షలు. బాగున్నాయి ౧౩ తో మీ అనుభవాలు.

 6. Dear Zuran,

  Many Many Happy returns of the day!!
  Have fun & a great a ahead.

 7. I see your blog regularly. మీ టపాలు చాలా బావుంటాయ్. A very happy b’day!!

 8. Dear MohanRazz,

  Many Many Happy returns of the day!!
  Have fun & a great a ahead.

 9. పుట్టినరోజు శుభాకాంక్షలు

 10. Hi Mohanrazz.. belated birthday wishes… nice posts.. keep posting

 11. intakee pune lo aa flat ekkada undi basu?

 12. 13 కి ఇంత కధ ఉందా !!

 13. Late ainaa latest wishes boss. I too like 13. Mukku pakkana chevilaa bhale no. adi. chevulatho pondina gnaanaanni swaasagaa maarchukoovaalane manchi sandeshaanni ichhe no. adi. 😀


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: