వ్రాసినది: mohanrazz | 2009/10/13

మణిరత్నం-యండమూరి-రావణ్

 

ravan

మణిరత్నం రావణ్- చాలా రోజులనుంచీ షూటింగ్ లో ఉన్న సినిమా. మణిరత్నం కి గుండెపోటు వచ్చి ఒకసారి, కేరళ అటవీ అధికారుల అభ్యంతరాలవల్ల ఒకసారీ, షూటింగ్ స్పాట్ లో ఏనుగు భీబత్సం చేసి కొంతమంది చనిపోవడం వల్ల ఒకసారి – ఇలా రకరకాల కారణవల్ల ఆలస్యంవుతూ వస్తోంది. హిందీ వెర్షన్ కి టైటిల్ రావణ్, తమిళ వెర్షన్ కి మాత్రం అశోకవనం. గతం లో హిందీ లో “యువ” అనిపెట్టి తమిళ లో ఆయుధ ఎళుతు (అక్షరమే ఆయుధం) అనీ, హిందీ లో దిల్ సే అని పెట్టినప్పుడు తమిళ్ లో ఉయిరే (ప్రాణం) అనీ – ఇలా రెండు భాషల్లోనూ రెండు వేర్వేరు టైటిల్స్ పెట్టే సంప్రదాయాన్ని ఈసారి కూడా దిగ్విజయంగా కొనసాగించాడు మణిరత్నం.

ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే- ఇక్కడా ఒక చిన్న  గమ్మత్తుంది. తమిళ్ వెర్షన్ లో విక్రం, పృథ్విరాజ్ (మళయాళ హీరో పృథ్విరాజ్ – మన పెళ్ళి సినిమా లో ఉన్న పృథ్విరాజ్ కాదు)నటిస్తున్నారు. ఇక హిందీ వెర్షన్ కి వచ్చే సరికి విక్రం, అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు. ఇలాంటి ద్విభాషా చిత్రాల్లో ఒక నటుడు రెండు సినిమాల్లోనూ నటిస్తున్నాడంటే- బహుశా తను ఒక భాషలో చేసిన పాత్రని రెండో సినిమాలోనూ రిపీట్ చేస్తున్నాడనుకుంటాం. అయితే ఇక్కడో చిన్న రూమరొచ్చింది. అక్కడినుంచీ మొదలైన నా కన్‌ఫ్యూజన్ ఇప్పటికీ తీరలేదు.

తమిళ్ లో హీరో పాత్రలో విక్రం, విలన్ పాత్రలో పృథ్విరాజ్ నటిస్తున్నారనీ, అయితే కొన్నిరోజులు షూటింగ్ జరిగాక హీరో పాత్రకంటే విలన్ పాత్ర బాగా నచ్చి విక్రం ఏరికోరి హిందీ లో విలన్ పాత్ర వేస్తున్నడని తెలిసిందనేది ఆ రూమర్. అయితే ఇక్కడ “హీరో”, “విలన్” అనే పదాలు నాకు క్లియర్ గా అర్థం కాకపోవడం వల్ల- ఆ కన్‌ఫ్యూజన్ మొదలైందన్నమాట. హీరో “రాముడు” తరహా పాత్రధారి, విలన్ రావణుడు తరహా పాత్రధారియా? లేక టైటిల్ “రావణ్” కాబట్టి రావణుడి తరహా పాత్రని హీరో గా చూపించి తద్వారా ఆటోమాటిగ్గా రాముడి పాత్రని విలన్ గా చూపిస్తున్నారా? అప్పుడు విక్రం తమిళ్ లో రాముడి పాత్రా? లేక రావణుడి పాత్రా? హిందీ లో రావణుడి పాత్రా లేక రాముడి పాత్రా? విక్రం కి “రావణ్” అనే టైటిల్ రోల్ ఇచ్చి ఆ రెండో పాత్రని అభిషేక్ బచ్చన్ చేస్తాడంటారా? అంటే అప్పుడు విక్రం ఏరికోరి హిందీ లో తీసుకున్నది “రాముడి” పాత్రా? ఫుల్లు కన్‌ఫ్యూజన్ గా ఉందా?? నాక్కూడా!!సరే, సినిమా రిలీజయేంతవరకు వెయిట్ చేస్తే అన్ని కన్‌ఫ్యూజన్స్ అవే పోతాయి.

 ఇక కథ విషయానికి వస్తే- ఎక్కడా కథ బయటికి పొక్కకుండా మణిరత్నం బాగా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే గతం లో మహాభారతం లోని “కర్ణుడు-దుర్యోధనుడు-అర్జునుడు” పాత్రల్ని సాంఘీకరించి దళపతి తీసిన మణిరత్నం ఈసారి “రామాయణం” లోని “రాముడు-రావణుడు-సీత-శూర్పణఖ” పాత్రల్ని సాంఘీకరించి ఈ సినిమా తీస్తున్నాడని రూమర్. రాముడి తరహా వ్యక్తి భార్య/గర్ల్ ఫ్రెండ్ ని రావణుడి తరహా వ్యక్తి కిడ్నాప్ చేయడం అనే పాయింటయితే సినిమా లో ఖచ్చితంగా ఉందనేది ఇంకొక గట్టి రూమర్. ఆ రాముడి తరహా వ్యక్తి భార్య రావణుడి తరహా వ్యక్తి ఆధీనం లో ఉన్నపుడు ఆ రావణుడి తరహా వ్యక్తి కి ఆకర్షితమవడం అనే వివాదాస్పద పాయింటూ ఉందనేది ఇంకో రూమర్. ఈ రూమర్సన్నిటికీ “తెర పడేది” ఈ బొమ్మ “తెరమీద పడ్డాకే”!

 
అయితే పై హెడ్డింగ్ చూసి- ఈ వ్యవహారం మొత్తం లోకి అసలు యండమూరి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న మీ బుర్రని తొలిచేస్తూండవచ్చు- అక్కడికే వస్తున్నా. ఓ పదిహేనేళ్ళ క్రితం అనుకుంటా యండమూరి వ్రాసిన ఒక పుస్తకం చదివా- “పాపులర్ రచనలు చేయడం ఎలా??” అని. కథ, నాటిక, నవల, సినిమా ఇత్యాది ప్రక్రియలన్నిటి మీదా విడివిడిగా తన అనుభవం తో వర్ధమాన రచయితలకి కొన్ని సూచనలిచ్చాడు యండమూరి(ఈ పుస్తకం మీద డిటెయిల్డ్ రివ్యూ ఇంకోసారెప్పుడైనా). అయితే అందులో కథాంశాన్ని సెలెక్ట్ చేసుకునే విషయం లో ఒక సూచన ఇస్తూ ఇలా వ్రాస్తాడు- “పాపులర్” రచనల్లో మనం చెప్పదలచుకున్న అంశం జనాభీష్టానికి అనుగుణంగానే ఉండడం మంచిది. ఉదాహరణకి రావణుడు సీతని ఎత్తుకుపోయినా సీత నిబద్దత తో రాముడికోసం ఎదురు చూసిందని వ్రాసి జనాన్ని ఒ(మె)ప్పించడం తేలిక. అలా కాకుండా జనాభీష్టానికి దూరంగా ఉన్న విషయాన్ని చెప్పి జనాన్ని ఒప్ప్పించాలంటే అందుకు ఎంతో గొప్ప సామర్థ్యముండాలి. ఉదాహరణకి-ఏళ్ళ తరబడి రావణుడి ఆధీనం లో ఉన్న సీత రావణుడిని మన్నించింది అని వ్రాయాల్సి వస్తే- సీత మానసిక స్థితిని సంఘర్షణ అత్యంత నేర్పు తో వివరించవలసి వస్తుంది. వస్తాడో రాడో తెలీని భర్త కోసం- వస్తూ ఎక్కడైనా ప్రమాదానికి గురయ్యాడా లేక బ్రతికే ఉన్నాడా తెలీని భర్త కోసం నిరీక్షించలేక, ఇక్కడ రావణుడు కూడా- తనని ఎత్తుకురావడం అనే విషయాన్ని ప్రక్కనపెడితే- మిగతా అన్ని విషయాల్లోనూ తనకి నచ్చడం లాంటి ఎన్నో విషయాల్ని అత్యంత ప్రతిభావంతంగా చూపిస్తే తప్ప  పాఠకుడు/ప్రేక్షకుడు కన్విన్స్ అవడు. నిజానికి అంత ప్రతిభావంతంగా చూపించినా కూడా జనం ఆ రచనని తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వర్ధమాన రచయితలు ఇలాంటివి ప్రయత్నించకపోవడం మంచిది. ఒకవేళ గొప్ప సక్సెస్ వచ్చాక- ఆత్మ సంతృప్తి కోసం, తనలోని రచనాసామర్థ్యానికి పరీక్ష పెట్టడం కోసం లాంటి సందర్భాల్లో ప్రయత్నిస్తే ప్రయత్నించవచ్చు.

 
ఇప్పుడు ఈ రావణ్ సినిమా కథ గురించి వస్తూన్న రూమర్స్ వింటే చాలా ఏళ్ళ క్రితం చదివిన ఈ యండమూరి పుస్తకం లోని అంశం గుర్తుకు వచ్చింది.


Responses

 1. రావణున్ని (అలాంటి పాత్రని) చూసి సీత (అలాంటి పాత్ర) ఆకర్షితురాలైంది (కనీసం అసహ్యించుకోలేదు, కొంచెం సానుభూతితోనే చూసింది) అనే పాయింటుని మన తెలుగు రచయితలు తీవ్రంగానే మధించేశారు ఆల్రెడీ .. అలనాడు కొకు అశోకవనం నించీ, మొన్నమొన్నటి డిఆర్ ఇంద్ర రావణజోస్యం దాకా.

  • అలాగే చలం గారు “జెలసీ” (సీత, రావణాసురుడిని ప్రేమించినట్టుగాను) అనే పుస్తకం లోనూ, “సావిత్రి” (సీత, రాముడి ని,రావణాసురుడిని పోల్చి, అన్నివిషయాలలోనూ రావణుడే గొప్పవాడు, రావణుడే, సీత ని ఎక్కువ గా ప్రేమించాడు అన్నట్టు గా) అనే పుస్తకం లోనూ ఈ విషయాలను చర్చించారు. ఆయన వాదన ను తిరస్కరించగలిగే తర్కం ఉంటుందని నేననుకోను, ఒక్క నమ్మకం త‌ప్ప. అంత గొప్ప గా రాస్తారు ఆయన.

 2. తమిళ ఇండస్ట్రీ లో సినిమాకి స్వచమైన తమిళ పేరుని పెడితే ఏదో రాయితి వస్తుంది. అందుకే మణిరత్నం తన సినిమాకి అలా పేర్లు పెట్టడానికి ఒక కారణం అయ్యి ఉండవచ్చు.
  – – – తికమక

  • @తికమక: కోట్లుపెట్టితీసే (మణిరత్నం లాంటి) నిర్మాతలకు తమిళ్ టైటిల్ ప్రెడితేవచ్చే ట్యాక్స్ ఎగ్జెమ్షన్ ఎంత?

   • బాబులూ, తమిళులు అసలే వీర భాషాభిమానులు. తమిళంలో టైటిల్ లేకుంటే అక్కడ B, C సెంటర్లలో సినిమాలాడవు.

 3. చాలా చక్కగా వివరించారు. “పాపులర్ రచనలు చేయడం ఎలా??” చదవలేదు కానీ, మీరు చెప్పిన విషయాలను బట్టి యండమూరి చెప్పింది సబబు గానే తోస్తుంది. మన మనసుల్లో నాటుకుపోయిన విషయాన్ని మార్చుకోవటానికి ఎవరూ సంసిద్దులుగా ఉండరు. ముఖ్యంగా తాము ఆరాధించే దేవుడి విషయంలో అసలు మార్చుకోరు.
  అలా మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేవుడి పేరుతో కొంతమంది చేసే అన్యాయాలు తప్ప.
  యండమూరి గురించి చెప్పారు కాబట్టి ఇంకొక విషయం గుర్తుకు వచ్చింది. ఆయన నాస్తికుడని ఇంటర్వ్యూ లోనో మరెక్కడో చెప్పుకున్నారు. కానీ ఆయన నవల అంతర్ముఖం లోనూ , తప్పు చేద్దాం రండి లోనూ దేవుడి పాత్ర ప్రముఖమైనది. చెప్పదలచుకున్న విషయం ఎక్కువ మందికి చేరాలని వ్రాసి ఉండవచ్చు.

 4. దళపతి సినిమా లో ధుర్యోదనుడు, కర్ణుడు ని హీరో లుగా, అర్జునుడి ని week గా చూపించారు కాబట్టి, ఈ రావణ్ సినిమా లో రావణాసురుడిని హీరో గాను, రాముడి కి negative shades పెట్టి చూపిస్తారేమో, వేచి చూడాల్సిందే !!!

 5. యండమూరి గారు నాస్తికుడు కాదు అని నా అభిప్రాయము. ఆయన మహేష్ భట్,హింది నటుడు దేవానంద్ తమ్ముడు విజయానంద్ (తీసరీ మంజిల్) గారి గురు వైన యు.జి.కృష్ణమూర్తి ని నాకు అభిమానిస్తారని అనిపిస్తుంది. యూ.జి.తెలుగు వాడు రచయిత చలం గారికి బాగ పరిచయమున్న వ్యక్తి , ఆయన రామకృష్ణ పరమహంస, రమణ మహర్హి కోవకు చెందుతారు.

 6. swami em cheppalanukuntunnavo artam kaledu achchu maniratnam cinema lage.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: