మీలో చాలా మంది బహుశా చూసే ఉంటారు. ఎవరో చెబితే నేను ఈ మధ్యే చూశానీ సినిమా. సింప్లీ సూపర్బ్ అనిపించింది నాకైతే!
సినిమా తీసింది అమోల్ గుప్తే (నిర్మాత, దర్శకుడు). ఈయన తారే జమీన్ పర్ సినిమా కి కథ, స్క్రీన్ ప్లే అందించారు. నాకు గుర్తుండి తారే జమీన్ పర్ డైరెక్షన్ కూడా ముందు ఈయనే మొదలెట్టాడు, అయితే ఆ తర్వాత ఏవో కారణాల వల్ల అమీర్ ఖాన్ డైరెక్షన్ టేకోవర్ చేసాడు..అప్పట్లో ఈయన అమీర్ ఖాన్ మీద “నా సొంత బిడ్డ (అంటే తారే జమీన్ పర్ సినిమా అన్న మాట) కి నన్నే ఆయా ని చేసాడు అమీర్ ఖాన్” అని నసిగినట్టు గుర్తు. అయితే ఈ సారి తన సొంత బిడ్డనే (పార్థో గుప్తే – ఆ పిల్లాడి పేరు) హీరో గా పెట్టి ఒక చిన్న బాలల కథా చిత్రం లాంటిది తీశాడు. బాలీవుడ్ ప్రమాణాలతో పోలిస్తే, బాగా లో బడ్జెటే ఈ సినిమా. అయితేనేమి – సినిమా చూసినతర్వాత ఒక మంచి సినిమా చూసామన్న సంతృప్తి మిగిలించింది. అయితే నేను చెప్పింది విని మీరు దీన్ని తారే జమీన్ పర్ స్థాయి లో ఊహించుకోకండి. తారే జమీన్ పర్ చూస్తే ఎలాంటి వారైనా కంటతడి పెట్టుకోవడం గ్యారంటీ అన్నట్టు ఉంటుంది. ఇది మరీ అంత స్థాయి లో లేదు. అసలు రచయిత ఉద్దేశ్యం అది కాదు కూడా.
ఇక కథ విషయానికి వస్తే – స్టాన్లీ అనే ఒక చురుకైన కుర్రాడు. రోజూ స్కూల్ అందరికంటే ముందే వస్తుంటాడు. తన మాటలతో కథలతో తోటి స్టూడెంట్స్ ని, టీచర్స్ ని ఆకట్టుకుంటుంటాడు. అయితే హిందీ టీచర్ ఒకాయనకి మాత్రం స్టాన్లీ అంటే పడదు. కారణమేంటో తెలుసా??? స్టాన్లీ టిఫిన్ బాక్స్ తెచ్చుకోడు. అవును. ఈ హిందీ టీచర్ మిగతా టీచర్ల, స్టూడెంట్ల డబ్బాల్లో ఐటెంస్ అనీ టేస్ట్ చేసే బాపతు ఈయన. స్టాన్లీ డబ్బా తెచ్చుకోక పోవడం వల్ల మిగతా స్టూడెంట్స్ తమ డబ్బాల్లోది స్టాన్లీ కి ఆఫర్ చేయడం వల్ల ఈయనకి ఆ ఐటెంస్ తినే వీలు లేకుండా పోతోంది.. ఇక ఆయన స్టాన్లీ ని “రేపటినుంచి డబ్బా తీసుకు వస్తేనే స్కూల్ కి రావాలి” అని హుకుం జారీ చేస్తాడు..ఆ తర్వాత కథ ఏమయింది, అసలు స్టాన్లీ స్కూల్ కిడబ్బా ఎందుకు తీసుకురాడు, ఆ తర్వాత ఎలా తీసుకువస్తాడు అనే ఒక చిన్న కథ, ఆ క్లైమాక్స్ లో ఇచ్చిన సున్నితమైన ట్విస్ట్ కొంచెం ఓపిగ్గా సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనస్సునీ ఆర్ద్రం చేస్తుంది.
నిజంగా ఇంత స్వచ్చమైన కథ ని చూసి చాలా కాలమైంది అనిపించింది. తెలుగులో ఇలాంటి కేటగరీ లో సినిమాలొ ఎన్నేళ్ళ క్రితం వచ్చాయో కూడా గుర్తులేదు. మొన్న ఏదో టివి షో లో ఒక కుహనా విమర్శకుడు వచ్చి మనకీ “ఆ నలుగురు” లాంటి “గొప్ప” సినిమాలు ఉన్నాయి అని వాదించాడు. ఆయన్ని మనసులోనే క్షమించేసి ఛానెల్ మార్చేసాను.
స్టాన్లీ గా చేసిన కుర్రాడు ముచ్చటగా చేసాడు. హిందీ టీచర్ పాత్ర డైరెక్టరే పోషించాడు. మరో అమ్మాయి -ఇంగ్లీష్ టీచర్- బాగా చేసింది.
ఏది ఏమైనా ఇది నాకు నచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. అయితే హడావుడిగా, ఫార్వర్డ్ చేస్తూ చూద్దామనుకునేపుడు ఈ సినిమా చూడకండి. హాయిగా ప్రశాంతంగా ఉన్నపుడు తాపీగా చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.
>హాయిగా ప్రశాంతంగా ఉన్నపుడు తాపీగా చూడండి. <
ఈ లైన్ బాగుంది. కొన్ని మంచి సినిమాలు ఇలానే చూడాలి.
By: వేణూశ్రీకాంత్ on 2012/11/09
at 11:33 ఉద.
***ఒక కుహనా విమర్శకుడు వచ్చి మనకీ “ఆ నలుగురు” లాంటి “గొప్ప” సినిమాలు ఉన్నాయి అని వాదించాడు. ఆయన్ని మనసులోనే క్షమించేసి ఛానెల్ మార్చేసాను.
Lol
By: Ramana on 2012/11/09
at 9:38 సా.
bagundhi
By: anu on 2012/11/12
at 2:23 సా.