2012 ఆస్కార్ ఫలితాలప్పుడు – ఉత్తమ చిత్రం “లైఫ్ ఆఫ్ పై” కి వస్తుందేమోనని అనుకున్నా… కానీ ఆ పురస్కారాన్ని “ఆర్గో” కొట్టేసింది. ఈ సినిమా గూర్చి నాకు పెద్దగా తెలీదు. కేవలం “లైఫ్ ఆఫ్ పై” ని కాదని దీనికి ఎందుకు వచ్చిందా అన్న ఒకే కారణం తో చూశానీ సినిమాని. సరే, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, ఇంతకీ దేని గురించి ఈ సినిమా, లైఫ్ ఆఫ్ పై తో పోలిస్తే ఎలా ఉంది వంటి విషయాలు చెప్పడానికే ఈ పోస్ట్.
ఇది ఒక ఫక్తు అమెరికన్ సినిమా. based on true story టైప్ సినిమా. ఆ ట్రూ స్టోరీ కూడా ఒక చారిత్రక సంఘటన. 1980 నాటిది. నేపథ్యం ఇరాన్ విప్లవం. 30 యేళ్ళకి పైగా ఇరాన్ ని పాలించిన నియంత లాంటి ఇరాన్ రాజు (షా) ని, ప్రజలు, విద్యార్థి సంఘాలు మరియు ఇతర ఉద్యమ సంఘాలు కలిసి 1979 లో జరిగిన ఇరాన్ విప్లవం లొ దింపివేస్తారు. షా స్థానం లో ఉద్యమ నాయకుడు అధికారాన్ని చేపడతాడు. ఇప్పుడు ప్రజల కాంక్ష – ఆ షా చేసిన ఆకృత్యాలని విచారించి దానికి తగిన శిక్ష విధించడం. కానీ ఆ షా వెళ్ళి అమెరికా లో ఆశ్రయం పొందుతాడు. దీంతో చిర్రెత్తిన ప్రజలు షా ని తిరిగి అప్పగించాలని ఉద్యమం చేస్తారు. ఉద్యమకారులంతా యు.ఎస్. ఎంబసీ మీద దాడి చేసి ఒక 50 మంది దాకా అమెరికన్ ఉద్యోగులని కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్ సీన్ తోనే ప్రారంభం అవుతుంది సినిమా.
అయితే ఈ 50 మంది ని అమెరికా ఎలా విడిపించింది అన్న దాని గురించి కాదు ఈ సినిమా. ఉద్యమకారులు ఎంబసీ మీద దాడి చేసినపుడు ఒక 6 మంది అమెరికన్ ఉద్యోగులు ఎలాగో తప్పించుకుని వెళ్ళి కెనడా ఎంబసీ ఆఫీసర్ ఇంట్లో దాక్కుంటారు. ఇప్పుడు CIA వాళ్ళు ఎవ్వరికీ డౌట్ రాకుండా (ముల్లు విరగకుండా, గుడ్డ చిరగకుండా) జాగ్రత్త గా వాళ్ళని అమెరికా తీసుకురావాలి. అది ఎలా చేసారు అన్నదే ఈ సినిమా. ఇరాన్ లో ఏమో అడుగడుగునా ఉద్యమకారులు. అమెరికన్ ఉద్యోగులు కనబడితే “స్పై” లని చెప్పి రోడ్డు మీద కాల్చిపడేస్తున్నారు. ఇక ఎయిర్ పోర్ట్ లో పాస్ పోర్ట్ చెక్, ఇమిగ్రేషన్ చెక్ ల తర్వాత ఇంకొక చివరి ‘ఉద్యమకారుల చెక్ పాయింట్ ‘ ఉంటుంది. అక్కడ దొరికినా చంపేస్తారు. మరి ఎక్కడా దొరక్కుండా CIA వీళ్ళందరినీ ఎలా అమెరికా తీసుకొచ్చిందనేది కథ. ఆ ఆరుగురు, ఒక హాలీవుడ్ సినిమా కి సంబంధించిన టెక్నీషియన్లనీ, ఇరాన్ లో షూటింగ్ జరుపుకోనున్న స్టార్ వార్స్ తరహా సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆర్గో’ కి కావలసిన లొకేషన్లు సెలెక్ట్ చేసుకోడానికి ఇరాన్ కి రెండురోజుల క్రితమే వచ్చారనీ చెప్పడానికి కావలసిన ఆధారాలు తయారు చేస్తారు. ఒక నిజమైన పెద్ద హాలీవుడ్ ప్రొడ్యూసర్ తో ఈ సినిమా ని నిజంగానే ప్రారంభిస్తారు. ప్రెస్ మీట్లు పెడతారు. ఆర్గో అనే సినిమాకి స్క్రిప్ట్ కూడా తయారు చేస్తారు. ఇదంతా ఆయా పత్రికల్లో న్యూస్ వచ్చేలా చూసుకుంటారు. ఈ సినిమా ఇరాన్ లో షూటింగ్ చేయడానికి కావలసిన సహాయం కోసం ఇరాన్ కల్చరల్ మినిస్టర్ ని కలుస్తారు. ఇలా నిజంగా ఒక హాలీవుడ్ సినిమా తీయడానికి కావలసిన సరంజామానంతా సిద్దం చేసి, ఆ 6 మంది ఉద్యోగులకి సినిమా టెక్నీషియన్లు గా నటించడానికి కావలసిన సమాచారాన్ని, కాస్తంత ట్రైనింగ్ ని కూడా ఇచ్చి..ఎక్కడా ఏ ఇబ్బందీ కలగకుండా, జాగ్రత్తగా ఆ 6 మందినీ అమెరికా చేరుస్తారు. స్థూలంగా ఇదీ సినిమా.
మొత్తానికి ఆసక్తికరంగా బాగుంది సినిమా. కాస్తంత ఉత్కంఠ గానే కొనసాగుతుంది. అయితే ఈ “ఉత్కంఠ” ఫ్యాక్టర్ ‘లైఫ్ ఆఫ్ పై ‘ లోని ఉత్కంఠ తో పోల్చలేం. లైఫ్ ఆఫ్ లో చాలా మందిని మెస్మరైజ్ చేసిన అంశం అందులో ఉన్న ‘ఫిలసాఫికల్ డెప్త్ ‘. ఇందులో ఆ స్థాయి లో మెస్మరైజ్ చేసిన అంశాలు పెద్దగా లేవు అని (కాస్త మొహమాటంగా) చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇది ఫక్తు అమెరికన్ మూవీ కావడం వల్ల అమెరికన్ సెన్సెస్ కి ఈ సినిమా బాగా అప్పీల్ అయి వుండొచ్చని అనిపించింది.
Trailer:
స్పందించండి