ఒకతనికి నత్తి ఉంటుంది. చివరికి అతను నత్తిని అధిగమిస్తాడు. ఇదీ కథ. “ఓరినీ, ఈ మాత్రానికే అస్స్కార్ ఇచ్చేస్తారేటి” అనుకుంటున్నారా..వెయిట్, వెయిట్. ఆ నత్తి ఉన్నది ఒక రాజు కుమారుడికి అయితే? ఈ కథ పిట్ట కథ కాకుండా ఒక వాస్తవ గాధ అయితే? అదీ, చారిత్రక నేపథ్యం ఉన్నదైతే? ఓకె, ఓకే… వీటన్నిటి వల్ల కథ కి కాస్త చిక్కదనం వచ్చినట్టు అనిపించిందా? సరే, కథ లోకి వెళదాం.
ఇంగ్లండ్ రాజు రెండవ కొడుకు ఆల్బర్ట్ కథానయకుడు. 1920 కాలం కథానేపథ్యం. నత్తి కారణంగా పబ్లిక్ స్పీకింగ్ లో చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఈయన ఖర్మకి అప్పుడప్పుడే రేడియోలు కనిపెట్టి చచ్చారు..ఈయన వేదిక మీద మాట్లాడుతూ మధ్యలో నత్తితో ఇబ్బంది పడటం, అసలు స్పీచ్ ని పూర్తిచేయలేకపోవడం..ఇవన్నీ రేడియో లో ప్రసారం కూడా అవుతాయి. నత్తి నయం చేసుకోడానికి చాలా థెరపీలు తీసుకుని ఆశలు వదిలేసుకుంటాడు కూడా. అయితే అతని భార్య ఎలిజిబెత్ అతన్ని ఒక ఆస్ట్రేలియా కి చెందిన థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం తో ACT-2 మొదలవుతుంది.
యువరాజు గారు ఈ థెరపిస్ట్ తో ఫ్రీ గా మూవ్ కాడు. థెరపీ కోసం, సమస్య మూలాలు తెలుసుకోవడం కోసం, తన చిన్ననాటి సంగతులు తెలుసుకోవడానికి డాక్టర్ ప్రయత్నిస్తే, King can not discuss his private matters in public అంటాడు. సమస్య మూలాల సంగతి ప్రక్కనబెట్టి కొన్ని మెకానికల్ ఎక్సర్సైజుల్ ఉ మాత్రం చేయించి నత్తి తగ్గేలా చేయమంటాడు. ఇదిలా ఉంటే, రాజు చనిపోయాక రాజు పెద్దకొడుకు కథానాయకుడి అన్న అయిన డేవిడ్ రాజు అవుతాడు. కానీ అతను ఇదివరకే రెండుసారు డైవర్స్ అయిన ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఇది చర్చి నిభందనలకి వ్యతిరేకం కావడం తో విధిలేని పరిస్థితుల్లో తన పదవి వదిలేసుకుంటాడు. దీనితో కథానాయకుడు ఆల్బర్ట్ ఇంగ్లండ్ రాజవుతాడు.
ఈలోగా హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధానికి కాలుదువ్వుతాడు. ఇప్పుడు రాజుగారు ప్రజలని ఉద్దేశించి యుద్ధానికి సన్నద్దం చేయడానికి రేడియోలో స్పీచ్ ఇవ్వాలి. ఇదే క్లైమాక్స్ స్పీచ్. ఒవరాల్ గా ఇదీ సినిమా.
ఇలా కథగా చెప్తే, పెద్దగా అనిపించకపోవచ్చేమో కానీ సినిమా చూసేటపుడు ఒక 15-20 నిమిషాలకంతా కథలో పూర్తిగా లీనమైపోతాం. అక్కడక్కడా కొన్ని హృద్యమైన సన్నివేశాలతో పాటు..1920-40 ల నాటి కాలాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ, అన్ని విభాగాల్లోనూ world class గా ఉన్న ఈ సినిమా… సినీ అభిమానులు చూసితీరదగ్గ చాలా మంచి చిత్రం.
స్పందించండి