వ్రాసినది: mohanrazz | 2013/10/02

2011 ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ – The Artist

the_artist_poster

2011 లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్, మూకీ సినిమా ఇది. 2011 లో మూకీ సినిమా తీయడమేంటి, అదీ బ్లాక్ అండ్ వైట్ లో. దానికి మళ్ళీ ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఏంటి అనుకుంటూ సినిమా చూసాను. సరే, ఇంతకీ కథ కమామీషు ఏంటి అనేది చూద్దాం –

ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే- “మూకీ సినిమాలు అంతరించిపోవడం మీద తీసిన మూకీ సినిమా ఇది”. 1920 ల లో సైలెంట్ మూవీ స్టార్ జార్జ్ వేలంటిన్. జనం లో ఈ హాలీవుడ్ స్టార్ కి ఆ కాలం లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. పెప్ మిల్లర్ అనే ఒకమ్మాయి ఈయన అభిమాని. ఆమెని తనే ప్రోత్సహించి తన సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర ఇప్పిస్తాడు. ఆమెకి ఇతని మీద విపరీతమైన అభిమానం అయితే, ఇతనికీ ఆమెతో కాస్త ‘కెమిస్ట్రీ’ ఉంటుంది – ఇద్దరూ కలిసినటించే సన్నివేశం లో. అంతే కాకుండా “ఆర్టిస్ట్ గా రాణించాలి అంటే, ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి” అని చెప్పి ఆమె ముఖం మీద ఒక చిన్న కృత్రిమ మచ్చ పెడతాడు హీరో. ఇదిలా ఉండగా మూకీల శకం ముగిసి టాకీల శకం ప్రారంభం అవడం తో (స్క్రీన్ ప్లే పరిభాష లో) ACT-2 మొదలవుతుంది.

స్టూడియో యజమాని హీరో ని పిలిచి, కొత్తగా వస్తున్న ఒక “టాకీ మూవీ” క్లిప్ చూపించి, భవిష్యత్తంతా టాకీలదే అని చెప్తే హీరో దాన్ని తేలికగా తీసిపడేస్తాడు. కానీ తర్వాత స్టూడియో వాళ్ళు తాము మూకీలు తీయడం మానేస్తున్నట్టు ప్రకటిస్తారు. తాము కొత్త గా తీస్తున్న టాకీ లో పెప్ మిల్లర్ ని హీరోయిన్ గా తీసుకుంటారు. ఇక సడెన్ గా నిరుద్యోగి అయిపోయిన హీరో, తానే నిర్మాతగా, దర్శకుడిగా మారి తనే హీరోగా ఒక సైలెంట్ మూవీ తీస్తాడు. సినిమా మీదే తన ఆస్తినంతా పెడతాడు. కానీ హీరోయిన్ నటించిన టాకీ, హీరో నటించిన మూకీ ఒకేరోజు రిలీజయి, టాకీ సూపర్ హిట్టయి, మూకీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. హీరో దివాళా తీస్తాడు. స్క్రీన్ ప్లే పరిభాష లో బహుశా ఇది కథకి mid point.

ఇక ఆ తర్వాత హీరో భార్య అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. హీరో ఒక చిన్న ఇంట్లోకి మూవ్ అవుతాడు. అక్కడ రోజూ తను నటించిన మూకీ సినిమాలు చూస్తూ, మందు కొడుతూ, సిగరెట్స్ కాలుస్తూ కాలం గడపడం అతని దినచర్య. ఇక పెప్ మిల్లర్ ఏమో టాకీ సినిమాలు చేస్తూ చాలా పెద్ద స్టార్ అయిపోతుంది. ఆమెకి ఇప్పటికీ హీరో మీద అదే అభిమానం. కానీ ఆవిడ మీద హీరో కి కోపం. ఆవిడ టాకీసినిమా తన భవిష్యత్తు ని మార్చేయడం ఒక కారణం అయితే, మూకీ సినిమాల మీద, మూకీ స్టార్స్ మీద ఆమె ఒక సందర్భం లో చేసిన వ్యాఖ్యలు మరో కారణం. డబ్బు కోసం హీరో తన సూట్ ని కుదువ పెట్టడం, తన ఇంట్లోని వస్తువులనన్నీ auction వేయించడం, తన దగ్గర మిగిలిన ఏకైక అసిస్టెంట్ కి జీతమివ్వలేక పనిలోంచి తీసివేయడం ఇలా సాగుతూ సాగుతూ ఒకానొక సమయం లో డిప్రెషన్ తో సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు హీరో. మరి ఆ తర్వాత ఏమవుతుంది, చివరకి మూకీ స్టార్ ఏమయిపోతాడు..హీరోయిన్ కెరీర్ ఏమవుతుంది… ఇవన్నీ ఈ కథలోని మిగిలిన అంశాలు.

కమామీషు:
చాలా స్వీట్ మూవీ ఇది. మూకీ సినిమా అయినా కథనం వేగం గా ఉంటుంది. మన శంకరాభరణం లాంటి సినిమాల్లో- శాస్త్రీయ సంగీతానికి బాగా ఆదరణ ఉన్నరోజుల్లో వైభవంగా బ్రతికిన శాస్త్రి గారు దాని హవా తగ్గాక సడెన్ గా తన ప్రాభవం కోల్పోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు అనే పాయింట్ లో ఉండే ఎమోషన్ లాంటిదే ఇందులోని ఎమోషన్ కూడా. ఇక ఈ సినిమాలోని కొన్ని చమక్కులైతే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. హీరో తాను తీసిన చివరి మూకీ మూవీ క్లైమాక్స్ – హీరో ఒక ఊబిలో మునిగిపోవడం తో ముగుస్తుంది. ఆ సన్నివేశం సరిగ్గా హీరో అప్పుల ఊబిలో మునిగిపోయే సన్నివేశం తో మ్యాచ్ అవుతుంది. ఇక సర్వం కోల్పోయాక హీరో రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళే సన్నివేశం లో బ్యాక్ డ్రాప్ లోని ఒక హోటల్ పేరు LOST STAR అని ఉంటుంది. ఇలాంటివి మరెన్నో. అన్నింటికంటే హైలెట్ ఏంటంటే, మూకీ గా ప్రారంభమైన సినిమా టాకీ గా ముగుస్తుంది. అంటే చివరి సన్నివేశం లో మాటలు ఉంటాయి. ఆ రకంగా మూకీ యుగం నుంచి టాకీ యుగం లోకి చరిత్ర మూవ్ అవడాన్ని సింబాలిక్ గా చూపించారు.

ఏది ఏమైనా ఒక స్వీట్ అండ్ సెన్సిటివ్ మూవీ చూసిన అనుభూతి మిగులుస్తుంది ఈ సినిమా.


వ్యాఖ్యానించండి

వర్గాలు