సినీ తారల ప్రచారానికి ఎన్నికల సమయంలో బోలెడు డిమాండ్ ఉంటుంది. అన్ని పార్టీలు కూడా స్టార్ క్యాంపెయినర్స్ కోసం వెతుకుతూ ఉంటాయి. అయితే ఈసారి ప్రజా కూటమి తరపున అత్యధికంగా తారలు ప్రచారం చేసినప్పటికీ వారి ప్రభావం ఎన్నికలలో ఎక్కడా కనిపించలేదు.
పనిచేయని బాలకృష్ణ ప్రచారం:
నందమూరి సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయడంతో, స్వతహాగానే ఆమె కుటుంబానికి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఆమెకు తారల అండదండలు లభించాయి. ఆమె కోసం హీరో మరియు ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ ఎంతగానో ప్రచారం చేశారు. బాలకృష్ణ కూకట్పల్లిలో ప్రచారం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి విపరీతంగా తిరిగినప్పటికీ అది నందమూరి సుహాసిని విజయానికి బాటలు వేయలేకపోయింది. దీనికితోడు బాలయ్య మాట్లాడే మాటలు ప్రజలను – అయితే మరింత తికమకకు గురి చేయడమో, లేదంటే కామెడీ రిలీఫ్ లాగా అనిపించడమో చేశాయి తప్ప ఎక్కడా కూడా బాలకృష్ణ ప్రచారం చూసి ప్రజలు నందమూరి సుహాసిని కి ఓటు వేయాలి అని కన్విన్స్ చేసే లా అనిపించలేదు. మొత్తం మీద మాస్ లో విపరీతంగా క్రేజ్ ఉన్న బాలకృష్ణ ప్రచారం నందమూరి సుహాసిని కి ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు.
ఇక పైసా వసూల్ సినిమా నిర్మాత అయినటువంటి భవ్య ప్రసాద్ శేరిలింగంపల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేయడం తో ఆయనకు కూడా బాలయ్య బాగానే ప్రచారం చేసి పెట్టాడు. కానీ, ఆయన కూడా అరికెపూడి గాంధీ చేతిలో ఓడిపోయాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాలయ్య ఎక్కువగా ఫోకస్ చేసినప్పటికీ బాలకృష్ణ ప్రచారం కారణంగా విజయం సాధించిన అభ్యర్థులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
జగపతిబాబు ఫోటో, అభ్యర్థన
జగపతి బాబు కి కూకట్పల్లి తో అవినాభావ సంబంధం ఉంది. ఆయన ఆర్థికంగా కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతం నుంచి కూకట్పల్లి కి షిఫ్ట్ అయ్యారు. దీంతో కూకట్పల్లిలో పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని కి తన మద్దతు ప్రకటిస్తూ జగపతిబాబు ఫోటో తో కూడిన కరపత్రాలను టిడిపి నేతలు కూకట్పల్లిలో విస్తృతంగా పంచారు. టిడిపి కూకట్పల్లి మేనిఫెస్టో పేరిట విడుదల చేసిన కరపత్రానికి జత చేస్తూ జగపతి బాబు ఫోటోతో పాటు నందమూరి సుహాసిని కి ఓటు వేయాల్సిందిగా ఆయన అభ్యర్థనను, ఆయన సంతకాన్ని కూడా జత చేసి ప్రచారం చేశారు. అయితే ఇది కూడా నందమూరి సుహాసినికి ఏరకంగానూ లాభం చేకూర్చలేదు.
తారకరత్న ప్రచారం, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ట్వీట్లు
తమ సోదరి అయిన నందమూరి సుహాసిని పోటీ చేస్తుండటంతో తారకరత్న ఆమె కోసం నియోజకవర్గంలో పర్యటించారు. నందమూరి ఆడపడుచు ను ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు కూడా నేరుగా ప్రచారం చేయకపోయినప్పటికీ, నందమూరి సుహాసిని ని గెలిపించాల్సిందిగా సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆ ప్రకటనను మెయిన్స్ట్రీమ్ మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే ఇవేవీ కూడా ప్రజలు నందమూరి సుహాసిని వైపు మొగ్గు చూపేలా చేయలేకపోయాయి.
తొట్టెంపూడి వేణు ప్రచారం
నటుడు తొట్టెంపూడి వేణు ఖమ్మం జిల్లాలో నామా నాగేశ్వరరావుకు ప్రచారం చేస్తూ దర్శనం ఇచ్చేసరికి జనాలు ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత నాగేశ్వరరావుకు వేణు వరుసకు బావ అవుతాడు అని తెలిసింది. నటుడు వేణు కూడా ప్రజలతో మమేకమైపోయి, తన బావ గారిని గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తూ, అడిగిన వారితో సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా ప్రచారం చేశారు. అయితే నామా నాగేశ్వరరావు కూడా ఈ ఎన్నికలలో ఓడిపోయారు.
కుష్బూ , విజయశాంతిల ప్రచారం
నటి కుష్బూ ప్రజా కూటమి ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. పైగా ప్రజలు ఆశ్చర్యపోయేలా కేసిఆర్ కుటుంబం మీద , కెసిఆర్ పాలన మీద పదునైన సెటైర్లు వేశారు. టిఆర్ఎస్ గుర్తు అయిన కారు అంబాసిడర్ మోడల్ ది అని , ఇప్పుడు ఆ మోడల్ కార్లు మూతపడ్డాయని, కాబట్టి కెసిఆర్ ని కూడా ఇంటికి పంపించండి అని ప్రజలను కోరుతూ రకరకాల సెటైర్లు వేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఇక తెలంగాణ రాములమ్మ విజయశాంతి తనకు తెలంగాణలో ఇప్పటికీ విపరీతమైన ప్రజాదరణ ఉందని నమ్ముతుంటారు. ఆమె సినీఫక్కీలో రాములమ్మ సినిమాలోని డైలాగులను గుర్తుచేస్తూ, కెసిఆర్ ని రాములమ్మ సినిమాలో విలన్ అయిన దొర తో పోలుస్తూ రకరకాల విమర్శలు చేశారు. అయితే కుష్బూ పదునైన సెటైర్లు కానీ రాములమ్మ సినిమా పంచ్ లు కానీ ప్రజా కూటమికి ఏ రకంగానూ మేలు చేయలేక పోయాయి.
మొత్తం మీద:
మొత్తం మీద తెలంగాణ ఎన్నికలలో తారల ప్రచారం చానళ్లకు కాస్త టి ఆర్ పి లను తెచ్చిపెట్టి వుండవచ్చు కానీ ,పార్టీలకు ఓట్లను అయితే తీసుకురాలేకపోయింది. సినిమా గ్లామర్ వల్ల సభలకు జనాలు వస్తారు కాని వారి డైలాగులు విని బ్యాలెట్ బాక్సులు బద్దలు చేయరని మరొకసారి నిరూపితమైంది.
– జురాన్ ( @CriticZuran)
Good to see your post after a long time Mohan.
By: gkothamasu on 2018/12/13
at 3:07 సా.
Thanks Gopi.. writing mostly in Telugu360.com nowadays.. how r u
By: mohanrazz on 2018/12/13
at 3:13 సా.