ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడానికి ఏర్పడ్డ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ గురించి తెలియనివారు ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఆంధ్ర ప్రాంత హక్కుల గురించి టీవీ డిబేట్ ల లో పాల్గొంటూ మాట్లాడే ఆయన, ప్రత్యేక హోదా కోసం పలుమార్లు సభలు నిర్వహించారు. అయితే ఇప్పుడు నెల్లూరులో జరిగిన ఒక సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వుల పాలు అవుతున్నాయి.
నెల్లూరులో చలసాని శ్రీనివాస్ సభ:
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడం కోసం పోరాటానికి విద్యార్థులు సమాయత్తం కావాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. నెల్లూరులో నిన్న జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన ” కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దాన్ని సాధించడం కోసం యువత పోరాటం చేయాలని, ” అంటూ ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అంతా నిన్న విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులోని అనిత హాలులో జరిగింది. అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగానే విద్యుత్తు ప్రసారానికి అంతరాయం కలగడంతో ఆయన నెల్లూరులో ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతుంటే బిజెపి ఉద్దేశ్యపూర్వకంగానే తన కార్యక్రమానికి అంతరాయం కలిగించేలా విద్యుత్తు సరఫరా నిలిపివేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
నెల్లూరు అనిత హాలులో కరెంటు పోతే కూడా కేంద్ర బిజెపి యే కారణమా ?
అయితే ఆయన వ్యాఖ్యలు విన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. కేంద్ర బిజెపి పనిగట్టుకొని నెల్లూరు అనిత హాలులో చలసాని గారు చేస్తున్న కార్యక్రమానికి విద్యుత్ అంతరాయానికి ప్రయత్నిస్తుందా జనాలు వారిలో వారు మాట్లాడుకున్నారు. ఏదో సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ నిలిచిపోతే కూడా దానిని కేంద్రంలోని బిజెపి కి ఆపాదించే ప్రయత్నం చూస్తుంటే వీళ్ళు ప్రజలని ఎంతగా “టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్” గా తీసుకుంటున్నారు అన్న విషయం అర్థమవుతుంది. అయినా విద్యుత్ శాఖ అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. నిజంగా ప్రభుత్వమే విద్యుత్ సరఫరా నిలిపి వేసి అడ్డంకులు సృష్టించింది అన్న వాదన నిజమైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఇబ్బందులు సృష్టించింది అని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది.
శివాజీ లాగే, చలసాని గారు కూడా అధికార టీడీపీకి మద్దతుదారా?
ఈ ప్రశ్న చాలా మందిలో ఎప్పటినుంచో ఉంది. గతంలో వైయస్ జగన్ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ బిజెపిని తీవ్రంగా విమర్శిస్తూ ప్రత్యేక హోదా కోసం వ్యాఖ్యలు చేసినప్పుడు గాని, చలసాని గారు వారిని అభినందిస్తూ మాట్లాడిన సందర్భాలు కానీ జగన్ దీక్షా స్థలికి వెళ్లి పరామర్శించిన సందర్భాలు గాని పెద్దగా లేవు. ఆయన ఎంతగా నేను రాజకీయంగా కలుస్తుంది అని చెప్పుకున్నప్పటికీ, ఇతర పార్టీల నేతలు ఉద్యమాలు చేసినప్పుడు ఈయన సడన్ గా మాయమవడం మాత్రం వాస్తవం.
చలసాని తో పాటు నటుడు శివాజీ కూడా ఆ మధ్య ప్రత్యేక హోదా కోసం పోరాడాడు. ఆయన కూడా తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాన్ని కాదు అని అన్నాడు. అయితే ఆపరేషన్ గరుడ సందర్భంగా ఆయన ముసుగు తొలగిపోయింది. పైగా ఆయన చంద్రబాబుతో పాటు కలిసి పార్టీ సభల్లో కూడా పాల్గొన్నారు. దాంతో ఇప్పుడు శివాజీ వచ్చి ఎంత తటస్థంగా ప్రవర్తించినా కూడా,ఆయన చివరికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి మద్దతుదారు లాగానే మాట్లాడతాడు అన్నది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. అయితే చలసాని విషయంలో ఇప్పటిదాకా పరిస్థితి అంత వరకు వెళ్ళలేదు కానీ, ఈయన కూడా చివరకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా గానే మాట్లాడుతాడా అని ప్రజల్లో అనుమానాలు మాత్రం ఉన్నాయి.
‘విభజన హక్కుల సాధన సమితి అధ్యక్షుడి’గా నుంచి ‘ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడి’ గా పరివర్తనం
బహుశా చాలామంది గమనించారో లేదో కానీ, ఈయన ఏ సమితి అధ్యక్షుడు అన్న విషయంపై టీవీ ఛానల్ లో కుప్పిగంతులు నడిచాయి. మొదట్లో ఈయన వ్యాఖ్యలని ప్రస్తావించేటప్పుడు ప్రముఖ టీవీ ఛానల్ లు అన్ని, ఈయన ని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు – చలసాని అని సంబోధిస్తూ వార్తలు చెప్పేవారు, స్క్రోలింగ్ లలో కూడా అలాగే వ్రాసే వారు. ఇలా 2014 నుంచి జెట్లీ ప్యాకేజ్ ప్రకటించే వరకు జరిగింది. అయితే అరుణ్ జైట్లీ ప్యాకేజీ ప్రకటించాక, తెలుగుదేశం పార్టీ ఆ ప్యాకేజీకి ఒప్పుకున్నాక, చంద్రబాబు నాయుడు మరియు ఆ పార్టీ నేతలు, ప్రత్యేక హోదా వల్ల ఎటువంటి లాభమూ లేదు, ప్యాకేజీ వల్ల హోదా కంటే ఎక్కువ లాభం అనే స్పష్టమైన వైఖరి తీసుకున్నాక, అగ్ర చానల్స్ అన్నింటిలోనూ ఈయనను ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు అని సంబోధించడం మానివేసి, విభజన హక్కుల సాధన సమితి అధ్యక్షుడు అని సంబోధించడం ప్రారంభించాయి. ఈయన కూడా పలు డిబేట్లో విభజన హక్కుల మీద ఫోకస్ పెడుతూ మాట్లాడటం ప్రారంభించారు. ఈ పరిస్థితి అంతా చంద్రబాబు ఎన్డిఏ నుంచి బయటకు వచ్చేంత వరకు కొనసాగింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్డిఏ నుంచి తెగతెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఈయన ‘విభజన హక్కుల సాధన సమితి అధ్యక్షుడి’ నుంచి మళ్లీ ‘ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడి’ గా పరివర్తనం చెందారు.
బహుశా ఈయనగానీ ఈయనను అలా సంబోధించిన టీవీ ఛానల్ లు గాని ప్రజలు ఇవేవీ గమనించరు అని అనుకుంటూ ఉండవచ్చు గానీ, ప్రజలు మాత్రం అన్నింటినీ స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమైన సందర్భాలలో ఈయన విభజన హక్కుల సాధన సమితి అధ్యక్షుడిగా ఉండడం, మళ్లీ చంద్రబాబు ప్రత్యేక హోదా రాగం ఎత్తుకోగానే ఈయన ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడిగా రూపాంతరం చెందడం ప్రజలలో అనుమానాలను కలిగిస్తోంది.
ఇప్పటికైనా ఇలాంటి మేధావులు తటస్థంగా ఉంటూ పోరాడాలి
అయితే ఆయన ఏ పార్టీకి అనుకూలంగా ఉంటేనేమీ, మన కోసం పోరాడుతున్నాడు కదా అని కొంతమంది వాదించవచ్చు గాని, ఇలాంటి ఉద్యమనేతలు ఏ పార్టీకి వంత పాడకుండా తటస్థంగా ఉండడం చాలా అవసరం. అలాగే ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా ప్రత్యేక హోదా కోసం పోరాడినప్పుడు వీరు వారికి మద్దతు పలకడం సముచితం. మరి భవిష్యత్తులోనైనా ఇలాంటి మేధావులు తటస్థంగా ఉంటూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు అన్నది వేచి చూడాలి.
– జురాన్ ( @CriticZuran)
స్పందించండి