వ్రాసినది: mohanrazz | 2024/02/25

జనసేన శ్రేణుల అంతర్మధనం: పవన్ కళ్యాణ్ రాజకీయ తప్పిదం చేశాడా  ?

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీ జనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్ కళ్యాణ్ కలిసి చేసిన ప్రకటన జనసేన శ్రేణుల లో తీవ్ర నైరాశ్యానికి దారి తీసింది. ఈ నేపథ్యం లో – పవన్ కళ్యాణ్, అంది వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవడంలో రాజకీయంగా విఫలమయ్యాడని, రాజకీయ కెరీర్లో అతి పెద్ద తప్పిదాన్ని చేశాడని జనసేన అభిమానులు విశ్లేషిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

మొదటి మూడేళ్లు టిడిపి కంటే బలమైన పాత్ర పోషించిన జనసేన

2019 ఎన్నికలలో దారుణ పరాజాయాన్ని మూట కట్టుకున్న తర్వాత జన సేన పార్టీ చతికిల పడిపోతుంది అని అనుకుంటే, అనూహ్య రీతి లో- కరోనా సమయంలో, అప్పట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల లో చాలా బలంగా ప్రజలతో మమేకమైపోయింది జనసేన. చింతమనేని ప్రభాకర్ వంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సిపి దౌర్జన్యాలకు భయపడుతూ ఉంటే జనసేన కార్యకర్తలు చాలా ధైర్యంగా అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడుతున్నారని ప్రశంసించారు. ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా జగన్ వర్సెస్ పవన్ స్థాయికి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ సఫలీకృతులయ్యారు.

వ్యూహాత్మక తప్పిదం-1: పార్టీ బలపడుతున్న సమయం లో చేసిన కీలక ప్రకటన

ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత పార్టీ మనుగడ కోసం, తన సొంత బలాన్ని పెంచుకోవడం కోసం అంది వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన తర్వాత ఆ క్యాడర్ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడంలో గతంలో జగన్ 100% విజయాన్ని సాధించి ఉన్నారు. అదేవిధంగా ఒక పార్టీ బలహీన పడ్డప్పుడు తమ పార్టీకి అనుగుణంగా దాన్ని మలుచుకోవడంలోనే ఆ పార్టీ అధినేత రాజకీయ చాణక్యత తెలుస్తుంది. జగన్ వర్సెస్ పవన్ గా ఆంధ్ర రాజకీయాలు కొనసాగుతున్న సమయంలో ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండగానే పవన్ కళ్యాణ్ – “రాష్ట్రంలో వ్యతిరేక ఓట్లు చీలనివ్వను” అంటూ చేసిన ప్రకటన జనసేన కంటే ఎక్కువ గా తెలుగు దేశం పార్టీ కి మేలు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక అక్కడి నుండి పవన్ కళ్యాణ్ వేస్తూ వచ్చిన ప్రతి అడుగు, తన సొంత పార్టీ అయిన జన సేన కంటే ఎక్కువ గా తెలుగుదేశం పార్టీ కి ఉపయోగపడిందనే అభిప్రాయాన్ని కూడా వీరు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయం లో ఆ ప్రకటన చేయకుండా పార్టీ ని బలొపేతం చేసుకుని వుంటే, ఇప్పుడు పొత్తులో ఇచ్చిన 24 సీట్ల లో గెలిచే స్థానాల కంటే ఎక్కువగానే ఒంటరిగా గెలిచే అవకాశం ఉండేది.

వ్యూహాత్మక తప్పిదం-2: టిడిపి అనివార్య పరిస్థితి ని జనసేన కి అనుగుణంగా మలచడం లో వైఫల్యం

జగన్, తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్షపూరిత వైఖరి అవలంబించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని అయినా సరే జగన్ ని ఓడించి తీరాలి అని సగటు తెలుగు దేశం అభిమాని సైతం భావించిన పరిస్థితి ఏర్పడింది. ఒకానొక సమయం లో పవన్ సీఎం అయినా పర్లేదు కానీ వచ్చేసారి జగన్ ని రానివ్వకూడదు అని, ఒక వేళ జగన్ వస్తే టిడిపి అనుకూల వర్గాలని వ్యాపారాలు చేసుకోనివ్వకపోవడమే కాదు, వారిని బతికి బట్ట కట్టనివ్వడనే అభిప్రాయం టిడిపి అభిమానులలో వ్యక్తమయింది. దీంతో పవన్ కి మద్దతు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి టిడిపి కి ఏర్పడింది. ఒక వేళ పొత్తు లోనే వెళ్దామని పవన్ నిర్ణయించుకున్నప్పటికీ ఈ టిడిపి అనివార్య పరిస్థితి ని జనసేన బలోపేతానికి దోహదం చేసే విధంగా, టిడిపి తో సమాన స్థాయి లో పొత్తు లో భాగస్వామ్యం పొందే విధంగా మలుచుకోవడం లో పవన్ వైఫల్యం చెందాడని భావిస్తున్నారు విశ్లేషకులు.

వ్యూహాత్మక తప్పిదం-3: వారాహి యాత్ర ఎందుకు నిలిపివేశారు?

పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్ర రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వాలంటీర్ వ్యవస్థ సహా అనేక అంశాల్లో వైఎస్ఆర్సిపి వైఖరి ని పవన్ కళ్యాణ్ నిలదీసిన తీరు కి, వైఎస్ఆర్సిపి పార్టీ పాలన ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరి తరఫు నుండి విపరీతమైన ప్రశంసలు లభించాయి. అయితే తెలుగు దేశం పార్టీ తో పొత్తు పొడవగానే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను పూర్తిగా పక్కన పెట్టేశారు. టిడిపి తో పొత్తు లో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పటికీ, వారాహి యాత్రను కొనసాగించి ప్రజలతో బలంగా మమేకం అయి ఉంటే కనీసం పొత్తు చర్చల లో మరిన్ని సీట్లు డిమాండ్ చేయగల పరిస్థితి లో పవన్ కళ్యాణ్ ఉండేవారు.

వ్యూహాత్మక తప్పిదం-4: చంద్రబాబు జైలుకెళ్లిన సమయం లో పవన్ వైఖరి

అధికార పార్టీ నేత ప్రతిపక్ష పార్టీ నేత మీద రాజకీయ కక్ష సాధింపు చేయడం భారత రాజకీయాల్లో కొత్తదేమీ కాదు. కానీ చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశం గా మారింది. ఆ సమయం లో చంద్ర బాబు కి లోకేష్, బాలకృష్ణ ల కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ బాసట గా నిలిచిన తీరు కి టిడిపి అభిమానుల నుండి సైతం ప్రశంసలు లభించాయి. ఆ సమయంలో తన సొంత రాజకీయ భవిష్యత్తు కోసం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా టిడిపి అధినేత కు బాసటగా నిలిచిన తీరు కొంతమంది కి అభినందించదగ్గ విషయంగా కనిపించినప్పటికీ, జన సేన పార్టీ భవిష్యత్తు పరంగా ఆలోచిస్తే ఆ సమయం లో పవన్ కళ్యాణ్ చేసింది రాజకీయ తప్పిదం గా విశ్లేషించాల్సి వస్తోంది. ఒక రాజకీయ పార్టీ అధినేత కి తన పార్టీ ని బలోపేతం చేయడమే ప్రథమ ప్రాధమ్యం గా ఉండాలి.

24 అసెంబ్లీ సీట్ల తో పొత్తు కి అంగీకరించడం కు అంగీకరించడం అన్నిటికంటే అతి పెద్ద రాజకీయ తప్పిదం:

వైకాపా “వై నాట్ 175” అనుకుంటూ ఉన్న సమయం లో, చచ్చిపోయింది అనుకున్న టిడిపి పార్టీని, వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న ప్రకటన ద్వారా బతికించడం, వారాహి యాత్రను పక్కన పెట్టి సొంత పార్టీ బలోపేతం చేయడాన్ని నిర్లక్ష్యం చేయడం, చంద్రబాబు అరెస్టు సమయంలో జనసేన పార్టీని మరింత చురుగ్గా బలోపేతం చేసే అవకాశాన్ని వదులుకోవడం వంటివన్నీ కూడా రాజకీయపరంగా తప్పిదాలు అయినప్పటికీ వాటినింటికంటే పవన్ కళ్యాణ్ చేసిన అతిపెద్ద తప్పిదం – కేవలం 24 అసెంబ్లీ సీట్ల కు పొత్తు కి ఒప్పుకోవడం అని జనసేన అభిమానులు భావిస్తున్నారు. మూడొంతులు సీట్లు- అంటే కనీసం 55 సీట్లు తీసుకొని, సీఎం సీటు పవర్ షేరింగ్ లో కూడా మూడొంతులు భాగం అంటే కనీసం ఒకటిన్నర సంవత్సరం ముఖ్యమంత్రి పదవి షేరింగ్ తీసుకుంటాడని భావించిన జన సైనికులకు 24 సీట్లకు పవన్ కళ్యాణ్ పొత్తు కు అంగీకరించడం ఏ కోశానా మింగుడు పడడం లేదు. ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా, లేదంటే జగన్ మళ్ళీ అధికరాన్ని నిలబెట్టుకున్నా, పోటీ చేసిన 24 స్థానాలలో గెలిచిన అత్తెసరు స్థానాలతో జన సేన కు రాజకీయంగా ఒరిగేది ఏమీ ఉండదని, 2024 ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా, జన సేన పార్టీ భవిష్యత్తు లో రాజకీయ ప్రాబల్యం క్రమ క్రమంగా కోల్పోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుందనే అభిప్రాయం జన సేన అభిమానులలో సర్వత్ర వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేయగలిగింది ఏమైనా ఉందా ?

జనసేన అభిమానుల ను తీవ్ర నిరాశకు గురి చేసిన ఈ పొత్తు ప్రకటన చేసిన డ్యామేజ్, జన సేన తో పాటు తెలుగు దేశం పార్టీ పైన కూడా పడే అవకాశం ఉంది. నిరాశ చెందిన అభిమానులు చంద్రబాబు చేతి లో పవన్ కళ్యాణ్ మోసపోయాడనే ఉద్దేశం తో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు ఉన్నచోట్ల కూటమి కి ఓటు వేయక పోతే పొత్తు వికటించి మరొక సారి జగన్ ముఖ్య మంత్రి సీటు చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాన్ని నివారించాలంటే ఇప్పటి వరకు ప్రకటించిన 99 స్థానాలు కాకుండా మిగిలిన 76 స్థానాల లో సమీకరణలను పునసమీక్షించి , ఓట్ల బదిలీ సరిగ్గా జరిగే విధంగా జనసేన శ్రేణులను నైరాశ్యం లో నుంచి బయటకి తెచ్చే విధంగా సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం పవన్ కి ఇప్పటికీ మిగిలి ఉంది.

పొత్తు లో భాగంగా, పవన్ కళ్యాణ్ మొదటి నుండి చెబుతూ వచ్చిన- “గౌరవప్రదమైన సీట్లు”, “మూడొంతులు సీట్లు” – తీసుకుని వుంటే, పైన చెప్పుకున్న వ్యూహాత్మక తప్పిదాలు సైతం “ప్రస్తుతానికి” ఒప్పిదాలుగా, “వ్యూహాలు”గా కనబడేవి. కానీ అలా జరక్కపోవడం తో ప్రస్తుతానికి “24 సీట్ల కు పొత్తు కు ఒప్పుకోవడం” అన్నది పవన్ రాజకీయ కెరీర్ లో అతి పెద్ద తప్పిదం గా భావించాల్సి వస్తోంది.

కొసమెరుపు:

నిజానికి పిక్చర్ ఇంకా అయిపోలేదు. పొత్తు పట్ల బిజెపి వైఖరి ఇంకా పూర్తిగా బహిర్గతం కాలేదు. వారు వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలీదు. పైగా ఆఖరి నిమిషాల్లో/ లేదంటే అనూహ్య పరిస్థితుల్లో ఎక్స్ట్రీం డెసిషన్స్ తీసుకోవడం పవన్ కి కొత్తేమీ కాదు. సీట్ల సర్దుబాటు విషయం లో జనసేన శ్రేణులని విస్మయానికి, విరక్తి కి గురి చేసేవిధంగా వచ్చిన ప్రకటనకి, జరిగిన పొరపాటు కి దిద్దుబాటు జరగక పోతే, అభిమానుల నుంచి జనసైనికుల నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా పవన్ కళ్యాణ్ సైతం పొత్తు నుండి దూరం జరిగే అవకాశాలు కూడా కొట్టి పారేయలేం. రాజకీయ పరిస్థితులు రానున్న రోజుల లో ఏ మలుపు తీసుకుంటాయి అన్నది వేచి చూడాలి


స్పందనలు

  1. Asalu mana bangaaramey teda ayinappudu… inni anukovatam suddha dandaga…. Evadyna okato rendo tappulu chestey… emo le anukovachu….inni tappulu gukka tippukokunda chestunnadantey… manadi banagaaram kaaadu….nakili bangaram… chivariki aa nakili bangaram kooda saar ni chusi “abbaa ila kooda kalti avvochaa” ani noru vellabettina paristithi. HE IS SOLD!!

    Good to see you coming back Mohan 👌


వ్యాఖ్యానించండి

వర్గాలు