నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పటి మాట. కాలేజ్ లో జాయినవగానే ఫ్రెషర్స్ డే (టాలెంట్స్ డే) ఒకటుంటుంది. ఫస్ట్ ఇయర్ కొన్ని ప్రోగ్రాంస్ చేసాను. రెండు స్కిట్స్ వ్రాయడం, అందులో చేయడం గట్రా..అయితే ఫస్ట్ ఇయర్ లో మనం కేవలం రచన/నటన కి పరిమితం అవుతూంటాం. దర్శకత్వం, దర్శకత్వ పర్యవేక్షణ సెకండియర్సో లేక థర్డియర్సో చూసుకుంటూంటారు. సరే, ఇక మనం సెకండియర్ కి వచ్చాం. వచ్చాక “పర్యవేక్షణ” కి ఫుల్లుగా ప్రిపేరైపోయాం. ఈలోగా ఒక “పిడుగు” లాంటి వార్త మా నెత్తిన వేసారు.
అప్పట్లో ర్యాగింగ్ నిరోధక చట్టం ఫుల్లు ఫాం లో ఉండేది. టాలెంట్స్ డే పర్యవేక్షణ సీనియర్ల చేస్తికిస్తే పర్యవేక్షణ పేరిట రిహార్సల్సప్పుడే ర్యాగింగ్ జరగవచ్చని కాలేజ్ ప్రిన్సిపాల్ గట్రా అందరూ కలిసి ఒక విప్లవాత్మకమైన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే “ఈ సారి మీ బోడి “పర్యవేక్షణ” అక్కర్లేదు. దానికి బయటి నుంచి వేరే వాళ్ళని పిలిపించాము” అని. ఇంతకీ “ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన పర్యవేక్షకుడు” అనుకుంటూ మా వాళ్ళందరమూ కవాతు చేస్తూ రిహార్సల్స్ జరుగుతున్న రూం దగ్గరికెళితే అక్కడొకతను ఉన్నాడు. మాటా మంతీ కలిపితే పరిచయం చేసుకుంటూ చెప్పాడు – “I am Rajasimha, currently working at Jayant C paranjee” అని. అప్పుడే జయంత్ ఫ్రెష్ గా వచ్చాడు ఇండస్ట్రీ కి. ప్రస్తుతానికి తాను జయంత్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నాననీ త్వరలోనే దర్శకత్వం కూడా చేస్తాననీ, కొంతమంది నిర్మాతలు తనని ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారనీ ఇలా ఏదో చెప్పాడు.
సరే, అతను ఎవరన్నా కానీ మన కాలేజ్ ఫంక్షన్ మనకి తెలీకుండా చేయడమేంటి, నాన్సెన్స్ అని సీనియర్సంతా కలిసి మాట్లాడుకుని ఒక రోజు క్లాసెస్ బాయ్‌కాట్ చేసాం. కాలేజ్ మేనేజ్‌మెంట్ దిగి వచ్చి ఒక మీటింగ్ పెట్టారు. అప్పటికి ఫుల్లు ఆవేశం లో ఉన్న కుర్రాళ్ళుగా ఏవేవో మాట్లాడాం, “అదే మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే- మన ఇంట్లో వాళ్ళకి తెలీకుండా చేస్తామా గట్రా గట్రా..” చివరాఖరికి ఆ టాలెంట్స్ డే క్యాన్సిల్ చేసి మళ్ళీ మా చేత ఫ్రెష్ గా ప్రోగ్రాంస్ డిజైన్ చేసి, ఫ్రెష్ గా రిహార్సల్స్ చేసి మొత్తానికి ఆ ఫ్రెషర్స్ డే ని ఫ్రెష్ గానే ముగించాము. అయితే ఆ రాజ సింహ అనే అతను వ్రాసిన ఒక స్కిట్ మాత్రం ఆల్రెడీ రిహార్సల్సన్నీ అయి ఉండడం చేత దాన్ని కూడా ప్రదర్శించాం. ఏ మాటకామాటే చెప్పాలి. ఆ స్కిట్ కూడా మంచి డైలాగులతో సెటైర్లతో బాగా ఉండింది. నాకు నచ్చింది. అయితే ఆ తర్వాత అతని గురించి ఆ ఎపిసోడ్స్ గురించీ మొత్తం మరిచిపోయాం.
మొన్నామధ్య “కరెంట్” అనే సినిమాకనుకుంటా డైలాగ్ రైటర్ గా ఈయన పేరు చూసా. ఆ తర్వాత ఓయ్ సినిమా ఫంక్షన్ లో సిద్దార్థ అంటున్నాడు- రాజసింహ లో మంచి సెన్సాఫ్ హ్యూమరుంది అంటూ. ఈ లోగా ఈ మధ్య ఇంకో న్యూస్- రాజసింహ తొలిసారి దర్శకత్వం వహిస్తూ వరుణ్ సందేష్ హీరోగా ఒక సినిమా ఏదో వస్తూ ఉందని. జయంత్ దర్శకత్వం వహించిన “శంకర్ దాదా MBBS” లో తెలుగు-ఇంగ్లీష్ సామెతల పార్ట్ జయంత్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన రాజ సింహ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ది అని ఆ మధ్య ఐడిల్ బ్రెయిన్ లో వ్రాసాడు. అంతా బానే ఉంది కానీ – నిజంగా నాకు ఆశ్చర్యమనిపించిన విషయం – అప్పుడెప్పుడో 1998 లోనే “ఇక త్వరలో దర్శకత్వం చేయబోతున్నాను” అని చెప్పిన వ్యక్తి కి దాదాపు 11-12 యేళ్ళ తర్వాత ఇప్పుడు అవకాశం రావడం..అప్పటిదాకా అతను సహనం తో ఒకే గోల్ మీద నిలబడగలగడం…!